BRS Leaders On Governor : గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, ఫామ్ హౌస్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫైర్
BRS Leaders On Governor : గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. గవర్నర్ రాజ్యాంగ పదవిలో ఉంటూ ఓ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
BRS Leaders On Governor : 'కొంత మందికి నేను నచ్చకపోవచ్చు. కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదు - నేషనల్ బిల్డింగ్ అభివృద్ధి. ఫామ్ హౌస్‌లు కట్టడం అభివృద్ధి కాదు' అంటూ రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ పై లో స్పందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కన్నా , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని తెలిపారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతుందన్నారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి ప్రాంగణంలో జాతిపిత మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. గత ఎనిమిది సంవత్సరాల్లో రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు, వంటి అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని ఆయన తెలిపారు. కొందరికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కళ్లకు కనపడటం లేదని, వాళ్లందరూ కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ ఆదరణ చూసి ఓర్వలేక
తెలంగాణలో ఉన్న నాయకులు అందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినవారని, వ్యవసాయం కోసం ప్రతి ఒక్కరు తమ బావుల వద్ద ఇండ్లు కట్టుకోవడం సహజమే అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అసలు వ్యవసాయం అనేది తెలియని వాళ్లకు ఫామ్ హౌస్ ల ప్రాముఖ్యత గురించి ఏం తెలుస్తుందని సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వారు రాష్టానికి ఏం అభివృద్ధి చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం తప్ప ప్రజల కోసం ఏదైనా ఒక్క మంచి పని చేశామని చెప్పుకునే దమ్ము కేంద్ర ప్రభుత్వానికి, అక్కడి నేతలకు లేదన్నారు. ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని వారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆనందపడుతున్నారని ఆయన అన్నారు. ప్రజలు ఇచ్చిన పదవులు అనుభవిస్తూ ప్రజలకు ఎలా మేలు చేయాలనే ఆలోచన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బందులు పెడదాం అనే విధంగా కేంద్రానికి చెందిన కొందరు ప్రముఖులు వ్యవహరిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తాం- మంత్రి తలసాని
గణతంత్ర వేడుకలపై ప్రభుత్వానికి నిబంధనలు తెలుసని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా మాట్లాడారన్నారు. గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాస్తామన్నారు. గవర్నర్ తమిళిసై విషయంలో రాష్ట్రపతి కల్పించుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజును రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ, గవర్నర్ తో పాటు పాల్గొన్నారని, వారుండగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.