Bandi Sanjay : కేసీఆర్ కుమార్తె చేతి వాచ్ కు ఉన్న విలువ వైద్య విద్యార్థిని ప్రాణానికి లేదు- బండి సంజయ్
Bandi Sanjay : తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన దీక్ష చేశారు.
Bandi Sanjay : తెలంగాణలో మహిళలకు రక్షణ కరవైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలన మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయామన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా బండి సంజయ్ హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష విరమణ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కుమార్తె చేతి వాచ్ కు ఉన్న విలువ వైద్య విద్యార్థి ప్రాణానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కుమార్తె చేతికి రూ.25 లక్షల విలువైన వాచ్‌ను పెట్టుకున్నారని, వైద్య విద్యార్థిని ప్రీతి చనిపోతే రూ. 10 లక్షలు మాత్రమే అందజేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రీతి కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుందన్నారు. మృతదేహానికి వైద్యం చేసి సినిమా చూపించారన్నారని ఆరోపించారు. ప్రీతి ఫోన్‌లోని డేటా డిలీట్ చేశారన్నారు. ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయడానికి అభ్యంతరమేంటి? అని ప్రశ్నించారు.
కేసీఆర్ భయం అంతా కవిత కోసమే
"దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేస్తే ఇక్కడ కేసీఆర్ అక్రమం అంటూ లేఖలు రాస్తారు. వీళ్లంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. సిసోడియో అరెస్టుపై ప్రతిపక్ష నేతలంతా ప్రధానికి లేఖ రాశారు. వీళ్ల ఉద్దేశం ఏంటి? స్కామ్ చేసిన వాళ్లను అరెస్టు చేయొద్దనా? సిసోడియా అవినీతి చేయకపోతే కోర్టు బెయిల్ ఇచ్చేది, ఎందుకు రెండు సార్లు కస్టడీ విధించింది. తన బిడ్డ కూడా నెక్ట్స్ అరెస్టు అవుతుందనే కేసీఆర్ ఇలాంటి లేఖలు రాస్తున్నారు. తన బిడ్డను కాపాడుకోవడానికి ఎంతకైనా కేసీఆర్ సిద్ధం. నీ బిడ్డ తప్పు ఉందా? లేదా? చెప్పాలి. సంతకాలు లేకుండా లేఖ విడుదల చేశారంటే? ఎంత దిగజారుడుతనం. నేను ప్రజాసంగ్రామ యాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రిని గద్దె దించాలని ప్రజలు కోరుకున్నారు. మేము సంతకాలు సేకరిస్తే కోటి మంది కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కోటి మంది సంతకాలు సేకరిస్తాం. వాటిని రాష్ట్రపతికి పంపిస్తాం. లిక్కర్ దందా చేసినందుకు తెలంగాణ పరువు పోతుంది. ఈ దందా చేసిన మీరు దేశం పరువు తీశారు."- బండి సంజయ్
విపక్షాలను వేధిస్తోంది కేసీఆర్ ప్రభుత్వమే
"ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తుంది కేసీఆర్. ప్రజా సమస్యలు పట్టకుండా ప్రగతి భవన్ లో పడుకుంటున్నారు. ఇప్పటి వరకు బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తను, నేతలను అరెస్టు చేయలేదు. అడ్డగోలుగా కొడుతున్న పోలీసులపై చర్యలు లేవు. మాపై దాడి చేసి తిరిగి నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. మంత్రులు, సీఎం పర్యటనకు వస్తే మమ్మల్ని బానిసలుగా అరెస్టు చేస్తారు. మా కార్యకర్తలు ఆ జిల్లా విడిచి వెళ్లిపోవాలి, లేకపోతే వచ్చి అరెస్టు చేస్తారు. విపక్ష నేతల లేఖ కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లడమే. ఈ సీఎస్ ను 30 సార్లు కోర్టు మొట్టికాయలు వేసింది. లిక్కర్ కేసులో కేసీఆర్ బిడ్డ పాత్ర ఉంటే తప్పనిసరిగా చర్యలు తప్పవు. వాళ్ల ప్రభుత్వమే సిసోడియా మంత్రి పదవిని తొలగించింది. విపక్ష పార్టీలు రిలీజ్ చేసిన లేఖలో కనీసం సంతకాలు లేవు. అయితే ఈ లెటర్ నకిలీదా? " - బండి సంజయ్