Bandi Sanjay : విజయశాంతి చివరి మజిలీ బీజేపే కావాలి, పార్టీని వీడిన వారంతా తిరిగిరండి- బండి సంజయ్
Bandi Sanjay : చిన్న చిన్న సమస్యలతో పార్టీని వీడినవాళ్లంతా తిరిగి బీజేపీకి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బీజేపీలో మాత్రమే సాధారణ కార్యకర్త కూడా ప్రధాని అయ్యే అవకాశం ఉంటుందన్నారు.
Bandi Sanjay : సైద్దాంతిక భావాలున్న నాయకులంతా బీజేపీలోకి తిరిగి రావాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందరం కలిసి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కార్యకర్తలకు ప్రధాని, రాష్ట్రపతి అయ్యే అవకాశాలుండేది బీజేపీలో మాత్రమే అన్నారు. నేను తప్పు చేసినా అడిగే హక్కు కార్యకర్తలకు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి ఉంటుందా? అని ప్రశ్నించారు. విజయశాంతి చివరి మజిలీ బీజేపే కావాలన్నారు. విజయశాంతి పాతికేళ్ల రాజకీయ ప్రస్థాన కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
‘‘చిన్న చిన్న సమస్యలకు ఇబ్బందిపడి భావోద్వేగాలతో బీజేపీకి దూరమైన వారిని నేను ఒక్కటే కోరుతున్నాను. సైద్దాంతిక భావాలుండి పార్టీని వీడిన వారంతా బీజేపీలోకి తిరిగి రావాలని కోరుతున్నాను. అందరం కలిసి కేసీఆర్ నియంత పాలనపై పోరాడతాం. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందాం’’అని బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాంపల్లి రాష్ట్ర కార్యాయలంలో నిర్వహించిన కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.
25 ఏళ్లు రాజకీయాల్లో ఉండడం మామూలు విషయం కాదు
సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు 25 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగడం మామూలు విషయం కాదని బండి సంజయ్ అన్నారు. సినిమా గ్లామర్ ప్రపంచం అని, రాజకీయాల్లో ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువ ఉంటాయన్నారు. అవన్నీ తట్టుకుని తెలంగాణ ఉద్యమకారిణిగా గర్జిస్తూ విజయశాంతి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోవడం సంతోషం అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యలో పార్టీని వీడినప్పటికీ తిరిగి పార్టీలోకి వచ్చిన విజయశాంతికి చివరి మజిలీ బీజేపీయే కావాలన్నారు. బీజేపీలోనే కార్యకర్తల నుంచి నాయకుల వరకు అన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఛాయ్ వాలా ప్రధాని అయ్యారని, ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అయ్యారని బండి సంజయ్ అన్నారు.
నేను తప్పు చేస్తే హక్కు కార్యకర్తలకు ఉంటుంది
"నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినైనా తప్పు చేస్తే అడిగే హక్కు కార్యకర్తలకు ఉంటుంది. నేను సరిజేసుకోకపోతే హైకమాండ్ కు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో ఆ పరిస్థితి ఉండదు. కుటుంబ పార్టీల నాయకులే అధ్యక్షులు. అడిగే ధైర్యం కూడా ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో రెండు తరాలుగా అధికారంలోకి లేకపోయినప్పటికీ కమిట్ మెంట్ తో పనిచేసే కార్యకర్తలున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి విజయశాంతి. తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. కేసీఆర్ తన యాస, భాష, జిమ్మిక్కులతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించుకున్నామో... ఆ ఆశయ సాధన కోసం మనమంతా పోరాడతాం." - బండి సంజయ్
తెలంగాణ ప్రకటన వచ్చిన రాత్రే నన్ను సస్పెండ్ చేశారు- విజయశాంతి
"25 ఏళ్ల రాజకీయం... చాలా పెద్ద ప్రయాణం. 1998 జనవరి 21న వాజ్ పేయి, అద్వానీలను కలిశాను. నాకు బీజేపీ సిద్ధాంతాలు నచ్చాయి. కరప్షన్ లేని, క్రమశిక్షణ కలిగిన పార్టీ ప్రజలకు మేలు చేస్తుందని నా నమ్మకం. తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. నాకు పదవులపై ఆశ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే కోరికే ఉండేది. ఆ రోజు సమైక్యవాద నాయకులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నారు. అందుకే సమైక్యవాదులతో పోరాడేందుకు తల్లి తెలంగాణ పార్టీ పెట్టాను. ఆరోజు పార్టీని వీడినందుకు ఏడ్చాను. నాలుగున్నరేళ్లు పార్టీని నడిపి ఎన్నో సమస్యలపై పోరాడాను. ఆ సమయంలో ఒక రాక్షసుడు ఎదురయ్యాడు. తెలంగాణ పేరుతో ముసుగు కప్పుకుని వచ్చి నమ్మించి మోసం చేశారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పూనుకున్నాడు. విలీనం చేసినప్పటి నుంచి నేను ఏనాడూ ప్రశాంతంగా లేను. టార్చర్ అనుభవించాను. ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఓడగట్టేందుకు కుట్ర చేశారు. 2013లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే అదేరోజు రాత్రి నన్ను సస్పెండ్ చేశారు. నా తప్పేమిటో చెప్పలేదు. నాకు విముక్తి కలిగినందుకు ఆనందం వ్యక్తం చేశానే తప్ప బాధపడలేదు. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ రాకూడదనే కేసీఆర్ సహా చాలా మంది ఎంపీలు భావించారు. నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేసుకుంటా. ఈ ఒక్కసారి గట్టిగా పనిచేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ కు తెలంగాణపై ప్రేమ లేదు. తెలంగాణ సంపదపైనే కేసీఆర్ కన్నేశాడు. మరోసారి అధికారం ఇచ్చారంటే అంతే. మీ భూములు లాక్కుంటారు. బండి సంజయ్ నాయకత్వంలోనే మళ్లీ ఎన్నికల్లోకి పోతున్నాం. సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ అధికారంలోకి వస్తుంది." - విజయశాంతి