Minister KTR : హైదరాబాద్ మెట్రోకు కేంద్రం మొండిచేయి, ఛార్జీలు పెంచితే ఊరుకోం- మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంచితే ఊరుకోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే మెట్రో అధికారులకు స్పష్టం చేశామన్నారు.
Minister KTR : హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపునకు బ్రేక్ పడినట్లు కనిపిస్తుంది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. మెట్రో ఛార్జీల పెంచితే ఊరుకోమన్నారు. మెట్రో రైల్ కొత్త పనులపై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి కేటీఆర్, మెట్రో పనులకు కేంద్రం అడ్డుపడుతుందని ఆరోపించారు. దేశంలోని చిన్న నగరాలకు కూడా మెట్రో రైళ్ల అభివృద్ధికి కోట్ల నిధులు కేటాయిస్తున్న కేంద్రం తెలంగాణ విషయంలో పక్షపాతం చూపిస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ నగరానికి నిధులు కేటాయించడంలేదని కేటీఆర్ విమర్శించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ ... హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోమన్నారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామని కేటీఆర్ తెలిపారు. మెట్రోలో ఏడీఎస్ ఉండాలనే నిర్ణయం కాంగ్రెస్ టైంలోనిదన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. పాతబస్తీకి మెట్రో పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.
తెలంగాణను శత్రుదేశంలా చూస్తున్నారు
బీజేపీకి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు, బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు కేటాయిస్తుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీ అడుగులకు మడుగులు వత్తే వారికి మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో అభివృద్ధికి నిధుల కోసం కేంద్రం వద్దకు వెళ్లగా అడ్డగోలు ప్రశ్నలతో వెనక్కి పంపుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మహానగరానికి నిధులు ఇచ్చేందుకు వయోబులిటీ లేదని, ప్రయాణికులు లేరంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ మెట్రోలో రోజుకు లక్షల మంది ప్రయాణిస్తున్నారన్నారు. ప్రయాణికులతో మెట్రో కోచ్‌లన్నీ కిక్కిరిసిపోతున్నాయన్నారు. అదనంగా కోచ్‌లు పెంచాలని, ట్రైన్‌లు పెంచాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని, సోషల్ మీడియోలో ప్రతీరోజు రిక్వెస్టులు వస్తున్నాయన్నారు. అలహాబాద్ మెట్రోలో ప్రయాణికులు ఎక్కుతారట, హైదరాబాద్‌లో ఎక్కరని కేంద్రం చెబుతుందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. శత్రుదేశంపై పగపెంచుకున్నట్లు తెలంగాణ ప్రజలపై కేంద్ర పగబట్టిందని, ఇది ఎంత వరకూ న్యాయమని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
మెట్రో ఛార్జీల పెంపులో మా బాధ్యత లేదు
మెట్రో ఛార్జీల పెంపులో తెలంగాణ ప్రభుత్వం పాత్ర లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. మెట్రో ఛార్జీల పెంపు అధికారం కేంద్ర ప్రభుత్వం మెట్రో నిర్వహణ సంస్థకే ఇచ్చిందని మంత్రి తెలిపారు. మెట్రో యాక్ట్ ప్రకారం ఛార్జీలు ఎంత వసూలు చేయాలని నిర్ణయించుకునే అధికారం మెట్రో నిర్వహణ సంస్థలకే ఉంటుందన్నారు. హైదరాబాద్ మెట్రో బాధ్యతలను ఎల్ అండ్ టీ చూస్తోందన్నారు. ఛార్జీల పెంపు నిర్ణయాధికారం ఆ సంస్థకే ఉంటుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్ అండ్ టీ ఛార్జీల విషయంలో పలు సూచనలు చేశామన్నారు. ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు పెంచితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించామన్నారు. ఆర్టీసీ బస్ ఛార్జీలతో సమానంగా ఉండేలా చూసుకోవాలని తెలిపామన్నారు. మెట్రో ప్రాజెక్టు అభివృద్ధి విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెట్రోలకు భారీగా నిధులు కేటాయించి, తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డించే వాళ్లు మనవాళ్లైతే భోజన వరుసలో ఎక్కడ కూర్చున్నా ఢోకాలేదన్నట్లు కేంద్రం తీరు ఉందని మంత్రి ఆరోపించారు.