CM KCR Letter : ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ లేఖ, రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ!
CM KCR Letter : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ లేఖ రాశారు. ఈ లేఖతో ఇప్పుడు సర్వత్రా రాజకీయ చర్చ మొదలైంది.
CM KCR Letter : ఈటల రాజేందర్(Etela Rajender) టీఆర్ఎస్ పార్టీ(TRS Party)లో ఒకప్పుడు కీలక నేత. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కానీ ఒక్కసారిగా ఆయనపై భూకబ్జా ఆరోపణలు, రోజుల వ్యవధిలో పార్టీ నుంచి బహిష్కరణ. మంత్రి నుంచి ప్రతిపక్ష పార్టీకి మారాల్సిన పరిస్థితి. ఆత్మగౌరవం కోసం అని ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హుజురాబాద్ కు ఉపఎన్నిక(Huzurabad By-election) వచ్చింది. ఈ ఎన్నికలను అటు సీఎం కేసీఆర్, ఈటల ఎంతో ప్రతిష్టంగా తీసుకున్నారు. హోరాహోరీగా జరిగిన ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలిచారు. బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ అడుగుపెట్టారు. సీఎం కేసీఆర్ ఈటల అసెంబ్లీ ఎదురుపడతారని అందరూ భావించారు. కానీ అసెంబ్లీకి వెళ్లిన గంటల్లోనే ఈటల సస్పెషన్. దీంతో సీఎం కేసీఆర్(CM KCR)-ఈటల రాజేందర్ మధ్య రాజకీయ వార్ జరుగుతుందని అందరూ భావించారు. కానీ తాజా ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాశారు.
ఈటలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పుట్టినరోజు(Birthday) సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ లేఖ రాశారు. "మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’’ అని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వివిధ పార్టీల నేతలు, బీజేపీ ప్రముఖులు, హుజూరాబాద్ కార్యకర్తలు ఈటలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ లేఖ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీంతో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనుకుంటున్నారు ప్రజలు.
వ్యూహమా లేక ఆనవాయితీ?
కేంద్రంపై యుద్ధం, బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తామని సీఎం కేసీఆర్ శపథం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ను కూల్చడమే తమ ప్రధాన ధ్యేయమని వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రజా ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ బర్తరఫ్ చేసిన ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ లేఖ రాయడంపై రాజకీయ విశ్లేషకులు చర్చలు ప్రారంభించారు. హుజురాబాద్ ఎన్నికల వరకు మీడియా ముందుకు అప్పుడుప్పుడూ వచ్చే సీఎం కేసీఆర్, ఆ తర్వాత బీజేపీని టార్గెట్ చేస్తూ వరుస మీడియా సమావేశాలు ఏర్పాటుచేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ తో పాటు రాష్ట్ర బీజేపీ నేతలను తన పదునైన మాటల తూటాలతో ఇరుకున పెట్టేవారు. యాసంగిలో ధ్యానం కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం దిల్లీకి మంత్రుల బృందంతో వెళ్లి, అవసరమైతే ప్రధాని మోదీని కలవాలని సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తు్న్న సమయంలో సీఎం కేసీఆర్ లేఖ రాజకీయ చర్చలకు దారి తీస్తుంది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ వ్యూహం మార్చారా? లేక ప్రశాంత్ కిషోర్ స్టంట్ అయి ఉంటుందా అని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈటలకు కేసీఆర్ లేఖ సాధారణమే అని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేల పుట్టినరోజులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలపడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ అంటున్నారు. బీజేపీలోకి వచ్చిన తర్వాత ఈటల ఫస్ట్ బర్త్ డే కావడంతో సీఎం లేఖ ప్రాధాన్యత సంతరించుకుందని తెలుస్తోంది.