Telangana Rain: తెలంగాణలో భారీ వర్షాలు, అప్రమత్తమైన అధికారులు - ఎక్కడికక్కడ భద్రతా చర్యలు
Telangana Rain: తెలంగాణలో గత మూడు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈక్రమంలోనే రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు.
Telangana Rain: తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ లో భారీ వర్షాలు కురవనున్నాయి.
దీంతో తెలంగాణలోని ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా భారీ వర్షాల కారణంగా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జార్రత్తలపై చర్చించారు.
జిల్లాలవారీగా నమోదైన వర్షపాత వివరాలివే..!
48 గంటలుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే జనగామ జిల్లా జాఫర్ గఢ్ లో అత్యధికంగా 18.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా రాజాపేట్ లో 17.1 సెం.మీ, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 14.6 సెం.మీ, కుమురం భీం జిల్లా బెజ్జూరులో 14.1 సెం.మీ, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 133.9 సెం.మీ, సిద్దిపేట జిల్లా తొగుటలో 13 సెం.మీ, భద్రాద్రి జిల్లా ఆళ్లప్లలిలో 11.8 సెం.మీటర్ల వర్షపాతం నమోదు అయింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో 9.4 సెంటీ మీటర్, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 8.4 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురంలో 7.6 సెం.మీ, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 7.3 సెం.మీ, హైదరాబాద్ షేక్ పేటలో 6.6 సెం.మీ, ఖైరతాబాద్ లో 4.7 సెం.మీ, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లిలో 5.6 సెం.మీ, కుబ్బుల్లాపూర్ లో 4.7 సెం.మీ, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో 4.5 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.
ఆయా జిల్లాల్లో అతిభారీ వర్షాలు - ఐఎండీ అలర్ట్
ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లాలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం - దక్షిణ ఒడిశా తీరంలో ఉండి, సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. ఈ ఆవర్తన ప్రభావం వల్ల వాయువ్య, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కురిసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.