Governor Thamilisai: "కేసీఆర్ వైఖరి చాలా బాధించింది, స్నేహపూర్వక వాతావరణ ఉండాలి"
Governor Thamilisai: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి తనను ఎంతగానో బాధించిందని గవర్నర్ తమిళిసై అన్నారు. స్నేహ పూర్వక వాతావరణం ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు.
Governor Thamilisai: స్వాతంత్ర దినోత్సవ వేళ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ఆమె.. అక్కడి జరిగిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈక్రమంలోనే ఆమె మాట్లాడుతూ... గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం గైర్హాజరవడం మంచిది కాదని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన తేనీటి విందు కార్యాక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ వెళ్లక పోవడం బాధాకరం అన్నారు. తాను గవర్నర్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తనతో ఇలాగే వ్యవహరిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ వైఖరి తనను చాలా బాధించిందని వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
చాలా కాలంగా విభేదాలు
గత కొంత కాలంగా తెలంగాణలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గా పరిస్థితులు మారిన విషయం తెలిసిందే. ప్రోటోకాల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై పలుమార్లు బహిరంగంగా గవర్నర్ విమర్శలు చేయగా.. పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు విమర్శలు గుప్పించారు. ఇలా రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. దీంతో కొన్ని రోజులుగా గవర్నర్ హాజరయ్యే అధికారిక కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడం వంటివి ఘటనలు చోటు చేసుకున్నాయి. గవర్నల్ కొన్ని విషయాల్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావడం బీఆర్ఎస్ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ విషయంపై బీఆర్ఎస్ మంత్రులకు, గవర్నర్ కు మధ్య మాటల యుద్ధం సాగింది. ఉస్మానియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని గవర్నర్ కామెంట్ చేయగా.. రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు కూడా గవర్నర్ కు అదే రీతిలో కంటర్ ఇచ్చారు. ఇలా వారి మధ్య గ్యాప్ వచ్చింది.
మరోసారి సంచలనంగా మారిన గవర్నర్ కామెంట్లు
ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో కేసీఆర్, గవర్నర్ ఒకే వేదికపై కలవడం, పలకరించుకోవడం, రాజ్ భవన్ లో జరిగిన తెంలగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ ఏడాది తర్వాత రాజ్ భవన్ లో అడుగు పెట్టడంతో వీరి మధ్య విభేదాలు కాస్త తగ్గినట్లు అనిపించింది. పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా గవర్నర్ తమిళిసై ఇటీవల ఆమోదించారు. ఇక గొడవంతా సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఇదిలా ఉండగానే ఈరోజు ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. విభేదాలు తగ్గాయి అనుకోగానే గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ పై కామెంట్లు చేశారు. మరీ ఈ తాజా కామెంట్లపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Read Also: వచ్చే ఆగస్టు 15న మళ్లీ వస్తున్నా- కలలన్నీ నెరవేరుస్తా: మోదీ