వచ్చే ఆగస్టు 15న మళ్లీ వస్తున్నా- కలలన్నీ నెరవేరుస్తా: మోదీ
వచ్చే ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని... వచ్చే ఆగస్టు 15న తానే ఎర్రకోట నుంచి ప్రసంగిస్తానంటూ మోదీ చెప్పారు.
ఎర్రకోటపై ప్రసంగం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మీ ముందుక వస్తానని అన్నారు. 2014లో మార్పు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. దేశప్రజలంతా నన్ను నమ్మారు. నేను మీకు ఇచ్చిన మాటను నమ్మకంగా మార్చుకున్నాను. చేసిన మంచి పనులకు 2019లో మద్దతుగా నిలిచారు. మళ్లీ నన్ను ఆశీర్వదించారు. నాకు మరో అవకాశం ఇచ్చారు. నీ కలలన్నీ నెరవేరుస్తాను. మళ్లీ ఆగస్టు 15న వస్తాను. నీ కోసమే బతుకుతున్నాను. మీరు నా కుటుంబం అందుకే మీ కోసం చెమటలు చిందిస్తాను.
90 నిమిషాలకుపైగా సాగిన ప్రసంగంలో స్వాతంత్య్ర సమరయోధుల గురించి, మణిపూర్ గురించి ప్రస్తావించారు మోదీ. ప్రభుత్వ విజయాలను వివరించారు. కొత్త ప్రపంచంలో భారతదేశం పాత్రపై అభిప్రాయాలు వ్యక్తం చేసారు. రాజకీయ ప్రత్యర్థులను కూడా టార్గెట్ చేశారు.
వచ్చేసారి ఆగస్టు 15న ఈ ఎర్రకోట నుంచి దేశం సాధించిన విజయాలను, సాధించబోయే విజయాలను మీకు వివరిస్తాను అన్నారు. నేను మీ నుంచి వచ్చాను, మీ కోసం జీవిస్తున్నాను. మీ కోసమే నేను కలలు కంటున్నా మీ కోసం చెమటలు చిందిస్తాను. మీరు నాకు ఈ బాధ్యత ఇచ్చారనే కాదు మీరు నా కుటుంబం అనినేను ఇలా చేస్తున్నాను. మీరు బాధపడుతుంటే చూడలేను అని అన్నారు.
2014లో మార్పు తెస్తానని హామీ ఇచ్చానన్న మోదీ 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు, మీరు నన్ను నమ్మారని, ఆ నమ్మకాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించానని చెప్పారు.
దేశం కోసం ఎంతో కష్టపడ్డారని, గర్వించదగ్గ పని చేశారన్నారు. మాకు దేశమే ప్రథమం, దేశమే సర్వోన్నతం. 2019లో మీరంతా మార్పు ప్రాతిపదికన మమ్మల్ని మరోసారి ఆశీర్వదించారు. ఆ ప్రదర్శన నన్ను మరింత ప్రోత్సహించిందన్నారు.
రాబోయే ఐదేళ్లలో అపూర్వమైన అభివృద్ధి జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చేసారి ఆగస్టు 15న దేశం సాధించిన విజయాలు, మీ బలాలు, మీ తీర్మానాలు, సాధించిన పురోగతి, దాని విజయం, దాని వైభవం, మరింత ఆత్మవిశ్వాసం గురించి ప్రస్తావిస్తాను.
ఎర్రకోట నుంచి మీ సాయం కోరేందుకు వచ్చానని, మీ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2047లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా భారత త్రివర్ణ పతాకం ప్రపంచంలో అభివృద్ధి చెందిన భారతదేశానికి త్రివర్ణ పతాకంగా నిలవాలి.
వచ్చే ఆగస్టు 15 నాడు తానే ఎర్రకోటపై జెండాను ఎగరేస్తానని మోదీ చెప్పడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నరేంద్ర మోడీ వచ్చే ఏడాది ఎర్రకోటపై కాకుండా తన ఇంట్లో జెండా ఎగురవేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
తన 90 నిమిషాల ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టునలను ప్రారంభిస్తానని చెప్పారు. దీనిపై కూడా ఖర్గే స్పందిస్తూ.. వచ్చే ఏడాది తన ఇంట్లోనే జెండా ఎగురవేస్తానని చెప్పారు. ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలకు మల్లికార్జున ఖర్గే హాజరు కాలేదు. అక్కడ ఆయన కుర్చీ ఖాళీగా ఉంది. ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై ప్రశ్నించగా మల్లికార్జున ఖర్గే తనకు ఆరోగ్యం బాగాలేదని అయితే తన కార్యాలయంలో జెండా ఎగురవేయాల్సి వచ్చిందని చెప్పారు.
ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ గత ప్రభుత్వాలను టార్గెట్ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలను ప్రస్తావిస్తూ అవినీతి భూతాలు దేశాన్ని వెంటాడుతున్నాయన్నారు. 140 కోట్ల మంది దేశప్రజల కృషి ఫలించిందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో అవినీతి రాక్షసుడు దేశాన్ని వెంటాడేవాడు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. అలాంటి వాటిని అరికట్టి బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాం. పేదల సంక్షేమం కోసం వీలైనంత ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ప్రయత్నించాం. అని అన్నారు.