Diwali Wishes: గవర్నర్, సీఎం దీపావళి శుభాకాంక్షలు - వాళ్లపై సెటైర్లు వేస్తూ విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమే ఈ దీపావళి అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అంధకారాలను తొలగించి తెలివి అనే వెలుగును దీపావళి ప్రసాదించాలని ఆంకాంక్షించారు.
గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో వెలుగులు, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ‘‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు... అందరి జీవితాల్లో వెలుగులు, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.’’ అని ఆమె ట్వీట్ చేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమే ఈ దీపావళి అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అంధకారాలను తొలగించి తెలివి అనే వెలుగును దీపావళి ప్రసాదించాలని ఆంకాంక్షించారు. తెలంగాణ మాదిరిగా దేశ ప్రజల అందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని, సుఖ శాంతులు, సిరిసంపదలతో తులతూగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
బాణాసంచా కాల్చే సమయంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భక్తి శ్రద్ధలతో దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సకల శుభాలతో అనుగ్రహించాలి - చంద్రబాబు
‘‘లోగిళ్ళలో వెలుగులు నింపి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇంట్లోకి ఆహ్వానించే దీపావళి పండుగ శుభవేళ... ఆ లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదినీ సకల శుభాలతో అనుగ్రహించాలని కోరుకుంటూ... ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు!’’ అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
సురక్షితంగా జరుపుకోండి - కేటీఆర్
‘‘దీపావళి పండుగ శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! ఈ దీపాల పండుగ... మనందరి జీవితాలలో ప్రగతి కాంతులు నింపాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ... దీపావళిని అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.’’ అని మంత్రి కేటీఆర్ ఓ వీడియోను విడుదల చేశారు.
ఈనాటి నరకాసురుల పాలన అంతం కావాలి - పవన్ కల్యాణ్
‘‘నరకాసురుడనే రాక్షసుడు అంతమయ్యాడన్న సంతోషంతో దీపాలు వెలిగించుకొని పండుగ చేసుకోవడం యుగయుగాలుగా కొనసాగుతోంది. ఆనాడు నరకాసురుడు ఒక్కడే.. మరి ఈనాడు ఎందరో నరకాసురులు పలు రూపాల్లో చెలరేగిపోతున్నారు. ఇటువంటి ఈనాటి నరకాసురులు ప్రజా పాలన నుంచి దూరమైన నాడు నిత్యం దీపావళి. దానికి మన ఓటే సరైన ఆయుధం.
దీపావళి అనంతరం ఎందరో గాయాల బారిన పడడం, ముఖ్యంగా కళ్లకు గాయాలు అవడం వింటుంటాం. అటువంటి ప్రమాదాల నివారణకు జాగరూకులై ఉండాల్సిందిగా మనవి. పర్యావరణానికి హాని చేయని బాణాసంచా సామగ్రిని వాడండి. దానివల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ దీపావళి పర్యదినాన ఆ లక్ష్మీ దేవి కటాక్ష వీక్షణలు భారతీయులందరికీ ప్రసరిల్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. లక్ష్మీ నారాయణుని అనుగ్రహముతో అందరికి అన్నింటా శుభం జరగాలి. ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు’’ అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
‘‘అపజయాల చీకట్లను చీల్చుకుంటూ.. విజయాల వెలుగులతో మీరంతా బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అందరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అని నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.