Governer Tamilsai : ఫోన్ ట్యాప్ చేస్తున్నారు - ఫామ్‌హౌస్ కేసులోనూ ఇరికించాలని చూశారు - తెలంగాణ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై సంచలన ఆరోపణ!
ఫామ్ హౌస్ డీల్స్ విషయంలో రాజ్‌భవన్‌ను ఇరికించాలని చూశారని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అనుమానంగా ఉందన్నారు.
Governer Tamilsai Vs KCR : తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారన్న ఆనుమానాలు ఉన్నాయన్నారు. అంతే కాకుండా ఫామ్ హౌస్ డీల్స్ విషయంలో రాజ్ భవన్‌ను ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఫామ్ హౌస్ డీల్స్ విషయంలో తుషార్ అనే వ్యక్తిపై కేసు పెట్టారని..గతంలో ఆయన రాజ్‌భవన్‌లో ఏడీసీగా పని చేశారన్నారు. ఈ కేసు విషయంలో తుషార్‌పై అనవసరంగా కేసు పెట్టారని మండిపడ్డారు. మొదట తుషార్ పేరు.. ఆ తర్వాత రాజ్ భవన్ పేరు ప్రస్తావించారని.. ఈ కేసులో.. అసలు రాజ్‌భవన్‌కు సంబంధం ఏమిటని తమిళిసై ప్రశ్నించారు. రాజ్‌భవన్ లో గవర్నర్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫామ్ హౌస్ డీల్స్‌లో వినిపించిన తుషార్ .. గవర్నర్ మాజీ ఏడీసీ
ఫామ్ హౌస్ డీల్స్ కేసుల్లో తుషార్ వెల్లపల్లి ప్రస్తావన కూడా ఉంది. ఫోన్‌కాల్ రికార్డింగుల్లోనూ ఆయన పేరు పదే పదే వినిపించింది. కేరళకు చెందిన తుషార్ భారత ధర్మ జనసేన (బీడీజేఎస్) నాయకుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ టాప్ లీడర్లతో సన్నిహిత సంబంధాలున్న తుషార్.. ఆ రాష్ట్ర ఎన్డీయే కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. కేరళలోని వాయనాడ్ నుంచి గత ఎన్నికల్లో రాహుల్‌గాంధీ మీద ఎన్డీయే తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తుషార్ గవర్నర్‌గా తమిళిసై వచ్చిన తర్వాత తెలంగాణ రాజ్‌భవన్‌లో ఏడీసీగా పని చేశారు. కొంత కాలం కిందట మానేశారు. ఇప్పుడు ఆయనను సాకుగా చూపి తమపై నిందలు వేయాలని చూస్తున్నారని గవర్నర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ బిల్లులపై చర్చకు ఎప్పుడైనా రావొచ్చన్న గవర్నర్
తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ఇటీవల ఆమోదించిన 7 బిల్లులు ప్రస్తుతం గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అందులో యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు కూడా ఉంది. దీన్ని ఆమోదించడం వల్ల ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తాయా..? అలా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందో చెప్పాలని, రిక్రూట్ మెంట్ పై వివరణ ఇవ్వాలని మంత్రి సబితకు గవర్నర్ సూచించారు. అయితే మొదట రాజ్ భవన్ నుంచి ఎలాంటి లేఖ అందలేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి తర్వాత వచ్చిందని అంగీకరించారు. అపాయింట్ మెంట్ వచ్చిన తర్వాత కలుస్తామన్నారు. ఈ అంశంపైనా గవర్నర్ తమిళిసై స్పందించారు. తనది ప్రగతి భవన్ కాదని.. రాజ్ భవన్ అని ఎవరైనా ఎప్పుడైనా రావొచ్చన్నారు.
రాజ్ భవన్ ప్రతిష్టను తగ్గించాలని చూస్తున్నారని ఆరోపణ
రాజ్ భవన్ ముందు ధర్నా చేస్తామని కొన్ని విద్యార్థి సంఘాల పేరుతో కొంతమంది హెచ్చరికలు చేస్తున్నారన్నారు. ఎవరైనా సరే తనను కలవొచ్చన్నారు. బాసర విద్యార్థులు.. ఇతర యూనివర్శిటీల విద్యార్థులు వచ్చి కలిశారన్నారు. ప్రజా సమస్యల విషయంలో తాను ఎల్లప్పుడూ సానుకూలంగానే స్పందిస్తానన్నారు. రాజ్ భవన్ ప్రతిష్టను తగ్గించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని.. కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రోటోకాల్ పాటించని కలెక్టర్, ఎస్పీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.