Huzurabad Campaign : హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం ! "ఫేక్" ప్రచారాలనే నమ్ముకున్న పార్టీలు !
హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు శక్తివంచన లేకుండా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అయితే ఎప్పటికప్పుడు వెలుగు చూసిన ఫేక్ లెటర్లు, ఫేక్ పోస్టులే ప్రచారాన్ని డామినేట్ చేశాయి.
![Huzurabad Campaign : హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం ! End of Huzurabad by-election campaign -BJP candidate crammed with fake letters Huzurabad Campaign : హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/23/8eed1e9f0dbe7d5939af9c540059cba0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ఆసక్తి రేపుతున్న హుజురాబాద్ బై ఎలక్షన్ కోసం హైవోల్టేజ్ ప్రచారం చేశారు. ఈ సారి కరోనా నిబంధనల కారణంగా 72 గంటల ముందే ప్రచారం ముగించాలని ఎన్నికల సంఘం నిబంధనలు పెట్టింది. ఈ కారణంగా 30వ తారీఖున పోలింగ్ అయినప్పటికీ 27వ తేదీనే ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. అభ్యర్థిని లేటుగా ప్రకటించి కాంగ్రెస్ కాస్త వెనుకబడినట్లుగా ఉన్నా.. చివరికి వచ్చే సరికి అన్ని పార్టీలు తమ శక్తి మేర ప్రచారం చేశాయి. ఈ సారి ప్రచారంలో ఎక్కువగా వినిపించిన మాట" ఫేక్ ".
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుండే ఈటల ప్రచారం !
జూన్ 12వ తేదీన ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరి.. వెంటనే హుజురాబాద్ వచ్చారు. అప్పట్నుంచి తన కార్యక్షేత్రం హుజురాబాద్‌గానే ప్రకటించుకున్నారు. దాదాపుగా ఐదు నెలల పాటు ఈటల ప్రచారం సాగిందని అనుకోవాలి. వెంటనే ఎన్నికలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఆలస్యం అయింది. అయినా ఈటల రాజేందర్ ఎక్కడా విశ్రమించలేదు. మధ్యలో ఆయన పాదయాత్ర కూడా చేశారు. కానీ మోకాలి గాయంతో ఆస్పత్రి పాలవడంతో పాదయాత్రకు విరామం ప్రకటించారు.. బీజేపీ అగ్రనేతలు ఎవరూ రకపోయినా కలసి వచ్చిన నేతలతోనే తన ప్రచారాన్ని చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చి ప్రచార గడువు ముగిసే వరకూ.. దాదాపుగా ప్రతి గ్రామాన్ని చుట్టబెట్టారు. ఓటర్లనూ పేరు పేరున ఓట్లడిగారు.
Also Read : ఆ విషయం తెలిసి కేసీఆర్ హైబత్ తిన్నడు.. ఓటుకు 20 వేలు పంచుతున్నడు
ఒంటి చేత్తో హుజురాబాద్ యుద్ధాన్ని చేస్తున్న హరీష్ రావు !
తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మొత్తం బాధ్యతల్ని హరీష్ రావు చూస్తున్నారు. మొదట మంత్రి గంగుల కమలాకర్‌కు బాధ్యతలు ఇచ్చారు. కానీ తర్వాత హరీష్ ను రంగంలోకి దింపారు. హరీష్ తన ట్రేడ్ మార్క్ ట్రబుల్ షూటర్ వ్యూహాలతో ఈటలను బలాలను నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. ఆయన ప్రధాన అనుచరుల్ని టీఆర్ఎస్‌లోనే ఉంచగలిగారు. సామాజికవర్గాల వారీగా సమావేశాలు పెట్టి తాయిలాలు ప్రకటించారు. హరీష్ కూడా వ్యూహాత్మకంగా ధరల పెరుగుదల అంశాన్నే హైలెట్ చేశారు. గ్యాస్, పెట్రోల్ రేట్ల పెంపునను చూస్తూ బీజేపీకి ఎలా ఓటేస్తామని అందర్నీ ఆలోచనలో పడేశారు. కేసీఆర్, కేటీఆర్ రాకపోయినప్పటికీ ఇతర ముఖ్య నేతలందరూ తలా కొంత సాయం చేయడంతో రెండు దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈటలను ఓడించడానికి హరీష్ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.
ఇంటికి ఒక్క ఓటు నినాదంతో కాంగ్రెస్ !
టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ముందుగానే ఖరారైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఫైనల్ అయ్యారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న బలమూరి వెంకట్‌ను నిలబెట్టారు. ఆయన కోసం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. ఇంటికి ఒక్క ఓటు నినాదంతో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. గెలుపు అవకాశాల కన్నా ముఖ్యంగా తమ ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ప్రచారంచేసుకుంది.
Also Read : రైల్వేస్టేషన్ల అభివృద్ధి.. రైతులకు పెన్షన్లు.. హుజురాబాద్ కోసం బీజేపీ మేనిఫెస్టో !
ఫేక్ లెటర్లు, పోస్టులతో హోరెత్తిన ప్రచారం !
హుజురాబాద్‌లో అత్యంత సుదీర్ఘంగా సాగిన ప్రచారంలో ఫేక్ ప్రచారానిది కీలక పాత్ర. ఈటల రాజీనామా చేసి బీజేపీలో చేరిన వెంటనే... ఈటల రాజేందర్ కేసీఆర్ ను క్షమాపణ కోరినట్లుగా ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అది ఫేక్ అని ఈటల మండిపడ్డారు. ఆయన అలా ఫేక్ అని చెప్పుకోవడం ప్రారంభించి.. ప్రచారం ముగిసే వరకూ చెప్పుకుంటూనే ఉన్నారు. అన్ని విధాలుగా ఈటలను ఇబ్బంది పెట్టే ఫేక్ పోస్టులు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల ముందు కూడా 0టల రాజేందర్ ఫిర్యాదు చేసినందునే దళిత బంధును నిలిపివేశామని ఎన్నికల సంఘం చెప్పిందంటూ ఓ లేఖ హఠాత్తుగా వైరల్ అయింది. అది ఫేక్ అని తేల్చారు. కానీ చర్చ నుంచి రచ్చ అయింది. కొద్ది రోజుల కిందటే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ముస్లింలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ ఓ పోస్ట్ వైరల్ అయింది. దానిపై ఖండనలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి బీజేపీ నేతలకు ఏర్పడింది. అంతకు ముందే ఓ సామాజికవర్గాన్ని ఈటల బావమరది అవమానించిటన్లుగా వాట్సాప్ స్టేటస్‌లు .. ఆడియో టేపులు ఇలా రకరకాలుగా బయటకు వచ్చాయి. ఇలా ఫేక్ పోస్టులతో హుజురాబాద్‌లో కావాల్సినంత రచ్చ కూడా అయింది.
Also Read: ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)