Casino Case ED : ఈడీ విచారణలో ఎల్.రమణకు అస్వస్థత - మరికొంత మంది కీలక నేతలకు కేసినో నోటీసులు !
కేసినో కేసులో మరికొంత మంది కీలక నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. విచారణకు హాజరైన ఎల్.రమణ అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు.
Casino Case ED : క్యాసినో కేసులో ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ జరుగుతుండగానే ఎల్ రమణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఈడీ అధికారులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం ఎల్.రమణకు గుండె ఆపరేషన్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఆయన ఈడీ విచారణకు మూడు అంతస్తులు మెట్ల మార్గంలో ఎక్కారు. వెళ్లిన వెంటనే నీళ్లు అడిగినట్టు తెలుస్తోంది. ఆ తరువాత కాసేపటికే అస్వస్థకు గురయ్యారు. జూన్‌లో నేపాల్‌లో నిర్వహించిన బిగ్ డాడీ ఈవెంట్ కు చికోటి ప్రవీణ్ నుంచి తనకు నే ఆహ్వానం ఉందని.. కానీ తాను వెళ్లలేదని ఎల్.రమణ చెబుతున్నారు.
మొత్తం 130 మంది చీకోటి కస్టమర్లకు ఈడీ నోటీసులు
చికోటి ప్రవీణ్ కేసినో ఈవెంట్లకు సంబంధించి కేసులో 130 మందికి నోటీసులిచ్చిన ఈడీ ప్రతిరోజు ఇద్దరిని విచారిస్తోంది. ఇందులో భాగంగా విచారణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ హాజరయ్యారు. గురువారం ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాథ్ రెడ్డి, హైదరాబాద్ పంజాగుట్ట ఊర్వశి బార్ ఓనర్ యుగంధర్ ను ప్రశ్నించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. గోవా, నేపాల్, థాయ్ లాండ్, హాంకాంగ్ లో క్యాసినోకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని ఈడీ విచారిస్తోంది. ఈ వారంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్లను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు.
ముందు ముందు పలువురు కీలక నేతలకు నోటీసులు
వెగాస్ బై బిగ్ డాడీ పేరుతో స్పెషల్ ఈవెంట్స్‌ను చికోటి ప్రవీణ్ నిర్వహించాడు. మే నెలలో కొన్ని చోట్ల, జూన్‌లో గోవా, నేపాల్‌లో.. భారీగా చికోటి ప్రవీణ్‌కుమార్ ఈవెంట్స్ నిర్వహించాడు. ఈ ఈవెంట్స్‌కు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. ఎవరెవరికి నోటీసులు జారీ చేశారన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈడీ ఆఫీసుకు వచ్చే వారిని బట్టి.. ఫలానా వాళ్లకు నోటీసులు అందాయని తెలుస్తోంది. గతంలో చీకోటి ప్రవీణ్‌ను ఈడీ నాలుగు రోజుల పాటు ప్రశ్నించింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారాలు అనేక మంది క్యాసినోలకు వెళ్లినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. దీనిపై కూడా ప్రవీణ్ బృందాన్ని లోతుగా ప్రశ్నించింది.
మనీలాండరింగ్ కోణంలోనే విచారణ
క్యాసినోలో జూదం ఆడాలంటే విదేశీ మారక ద్రవ్యం కావాలి. పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తీసుకు వెళ్లడం సాధ్య పడదు. ఈ క్రమంలోనే తమకు కావాల్సిన విలువకు తగ్గట్టు నగదు చెల్లిస్తే ప్రవీణ్, అతని అనుచరులు ఇక్కడే టోకెన్లు ఇచ్చే వారని, వాటితోనే విదేశాల్లో జూదం ఆడేవారని తెలుస్తోంది. ఫెమా నిబంధనల ప్రకారం ఇది చట్ట విరుద్ధం. దీనిపైనే ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. హవాలా మార్గంలో ద్రవ్య మారకం జరిగనట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దాని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలులోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.