KA Paul : హైదరాబాద్ మినహా తెలుగు రాష్ట్రాల్లో అన్ని లోక్ సభ స్థానాలు గెలుస్తాం, అమిత్ షాతో కేఏ పాల్
KA Paul : ఏపీ, తెలంగాణతో సహా భారత్ అప్పులపై కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించానని కేఏ పాల్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మినహా అన్ని ఎంపీ స్థానాల్లో ప్రజశాంతి పార్టీ విజయం సాధిస్తుందన్నారు.
KA Paul Meets Amit Shah : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శుక్రవారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ మినహా తెలంగాణ, ఏపీలో అన్ని లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని కేఏ పాల్ అన్నారు. దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లోనూ ప్రజాశాంతి పార్టీ పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని తాము భర్తీ చేస్తామన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశ అప్పులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.8 లక్షల కోట్లు, తెలంగాణ అప్పులు రూ.4.50 లక్షల కోట్లు అని కేఏ పాల్ అన్నారు. భారతదేశం అప్పులు రూ.కోటి లక్షలకు చేరిందన్నారు. కేవలం రూ.3.50 లక్షల కోట్లు అప్పు చేసిన శ్రీలంక ఇవాళ దివాళా తీసిందన్నారు. ఇందుకు ప్రధాన కారణం కుటుంబ పాలన ఒక కారణమని కేఏ పాల్ ఆరోపించారు.
పవన్ కల్యాణే బీజేపీ వెంట పడుతున్నారు
తెలంగాణను కేసీఆర్ కుటుంబం 8 ఏళ్లుగా పరిపాలిస్తుందని, రూ.7 లక్షల కోట్లు ఏంచేశారో కేసీఆర్, కేటీఆర్ చెప్పరన్నారు. తెలుగు రాష్ట్రాలు, దేశంలోని సమాకాలీన అంశాలపై అమిత్ షాతో చర్చించామన్నారు. తనపై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిని అమిత్ షా తీవ్రంగా ఖండించారన్నారు. ఏపీకి నిధులు ఇవ్వాలని కోరామన్నారు. ఏపీలో బీజేపీ, జనసేనకి ఎలాంటి ఓటు బ్యాంక్ లేదన్న కేఏ పాల్, ఓటు బ్యాంక్ లేని పవన్ కల్యాణ్ తో పొత్తు ఎందుకని కేంద్ర మంత్రిని అడిగారన్నారు. పవన్ కల్యాణే తమ వెంట పడుతున్నారని అమిత్ షా చెప్పారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మినహా అన్ని ఎంపీ స్థానాల్లో ప్రజశాంతి పార్టీ విజయం సాధిస్తుందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానన్నారు.
అమిత్ షాతో కేఏ పాల్ భేటీ
అంతకు ముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో శాంతి భద్రతలపై అమిత్ షాతో చర్చించారు. తనపై జరిగిన దాడిని కేంద్ర మంత్రికి తెలిపిన కేఏ పాల్ జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని కోరామన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరానన్నారు. తెలంగాణలో అవినీతి, అన్యాయం, అక్రమాలు తన జీవితంలో ఎన్నడూ చూడలేదని కేఏ పాల్ అన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి, కేటీఆర్ అక్రమాల వల్లే లక్షల కోట్లు మాయమయ్యాయన్నారు. దేశం శ్రీలంక మాదిరి అయిపోతుందని, అప్పులు పరిస్థితిపై ఆయన మాట్లాడారు. తనపై దాడి చేశారని, ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీకి చెబుదామంటే సమయం లేదన్నారన్నారు. తనపై కేసీఆర్ చేయించిన దాడికి త్వరలోనే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కేఏ పాల్ విమర్శలు చేశారు.