Magunta Raghavareddy : మాగుంట రాఘవరెడ్డికి పది రోజుల ఈడీ కస్టడీ - ఢిల్లీ లిక్కర్ స్కాంలో వేగంగా దర్యాప్తు !
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవరెడ్డికి పది రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
Magunta Raghavareddy : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్ట్ అనుమతి ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ రెడ్డిని ఈడీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో ఈడీ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ రెడ్డి పేర్లను ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులను విజయ్ నాయర్ సేకరించి ఆప్ నేతలకు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. సౌత్ గ్రూప్‌లో శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి నివాసాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు కూడా నిర్వహించాయి.
మరో వైపు ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు సీబీఐ కస్టడీ ముగిసింది. బుచ్చిబాబును రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేయగా మూడ్రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది కోర్టు. జ్యుడీషియల్ రిమాండ్‌కు ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. దీంతో కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈయన గతంలో ఎమ్మెల్సీ కవితతోపాటు ఈ స్కాంలో ప్రముఖంగా వినిపిస్తున్న వ్యక్తుల వద్ద సీఏగా పని చేశారు. రామచంద్ర పిళ్లైకి కూడా చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేశారు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నారు. బుచ్చిబాబు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. గతంలో ఆయన ఇంట్లో సోదాలు కూడా చేసింది. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. తర్వాత అరెస్ట్ చేసి ప్రశ్నించింది.
గత కొన్ని రోజులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఈ స్కామ్ కేసులో రెండు రోజుల క్రితం న్యూఢిల్లీ కేంద్రం పని చేసే చారియట్ మీడియాకు చెందిన రాజేశ్ జోషి అనే వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో నగదును ఒక చోట నుంచి మరోచోటకు ఈయన తరలించారని రాజేశ్ జోషిపై ఆరోపణలు ఉన్నాయి. తమ ఆధీనంలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. రాజేష్ జోషిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ మల్హోత్రాను కూడా ఈడీ అధికారులు ఫిబ్రవరి 8 అరెస్టు చేశారు. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతణ్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నో మలుపులు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టిందని ఈడీ ఈ మధ్యే వెల్లడించింది. రెండో చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ, ఈ విషయం స్పష్టం చేసింది. ఈడీ చెప్పిన వివరాల ప్రకారం, ఆప్ సర్వే టీమ్‌లకు దాదాపు రూ.70 లక్షలు చెల్లించింది ఆప్. ఈ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ ప్రచారంలో పాల్గొన్న వాళ్లకు డబ్బులు అందేలా చూశారని ఈడీ తెలిపింది. ఆ చార్జ్‌షీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా చేర్చింది. కేజ్రీవాల్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 17 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. మొదటి ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చిన ఈడీ ఈసారి ఏకంగా కేజ్రీవాల్ పేరునీ జోడించింది.