MLAs Poaching Case : ఫామ్‌హౌస్ కేసు సీబీఐకి ఇవ్వడానికి 45 కారణాలు - హైకోర్టు తీర్పు కాపీ వెల్లడి !
ఫామ్ హౌస్ కేసులో హైకోర్టు తీర్పు కాపీ వెలుగులోకి వచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రస్తావన కూడా ఉంది.
MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి ఇవ్వడానికి 45 కారణాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తన తీర్పులో వెల్లడించారు. తీర్పు కాపీ హైకోర్టు వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేశారు. ఈ తీర్పులో కీలక విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్ చేయడంపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు విడుదల చేయడం కూడా సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్టు స్పష్టం చేసింది. తన తీర్పులో 26 కేసుల్లో పాత జడ్దిమెంట్లను న్యాయమూర్తి ప్రస్తావించారు.
కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు సరిగ్గా జరిగిందని అనిపించడం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ 455/2022 ను సీబీఐకి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చారు. సిట్‌ను రద్దు చేసి.. కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జడ్జిమెంట్ కాపీలో కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రస్తావన చేర్చడం కూడా సంచలనం సృష్టిస్తోంది.
దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి ప్రజల వద్దకు వెళ్లిపోయాయని.. దర్యాప్తు సమాచారాన్ని మీడియా తో సహా ఎవరికి చెప్పకూడదని.. కానీ దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయమని హైకోర్టు వ్యాక్యానించారు. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఫెర్ ఇన్వెస్టిగేషన్ లాగా అనిపించలేదు.. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చునని.. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్ రద్దు చేస్తూ హైకోర్టు తెలిపింది.
హైకోర్టు తీర్పు ఆధారంగా సీబీఐ.. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే కేసు నమోదు చేస్తుంది. సిట్ దర్యాప్తును పూర్తిగా రద్దు చేసినందున.. సీబీఐ ఈ కేసులో ఏం జరిగిందో మొదటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయనుంది. ఫిర్యాదుదారుడైన పైలట్ రోహిత్ రెడ్డి నుంచి మరోసారి సీబీఐ స్టేట్ మెంట్ నమోదు చేయనుంది. ఇలాగే ఇతర ముగ్గురు ఎమ్మెల్యేల స్టేట్ మెంట్ నమోదు చేసే అవకాశం ఉంది.
అయితే ఫామ్ హౌస్ కేసును సీబీఐకి ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే డివిజన్ బెంచ్‌లో..లేకపోతే సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనుకుంటోంది. తీర్పు కాపీ వచ్చే వరకే....ప్రస్తుతం సీబీఐ కేసు నమోదు చేయకుండా హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు తీర్పు కాపీ వచ్చినందున ఆ ఉత్తర్వులు అమల్లో లేనట్లే. ఇప్పుడు..సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటాయన్నది కీలకంగా మారనుంది.