Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
Telangana Elections 2024: కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రఘురామి రెడ్డి విషయంలో ఓ ప్రత్యేకత ఉంది. ఈయన ఇద్దరు ప్రముఖులకు వియ్యంకుడిగా ఉన్నారు.
Telangana Congress MP Candidates: తెలంగాణ లోక్ సభ ఎన్నికల కోసం పెండింగ్ లో ఉన్న అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. తెలంగాణలో కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఏఐసీసీ బుధవారం (ఏప్రిల్ 24) ప్రకటించింది. వీరిలో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా మహ్మద్ వలీఉల్లా సమీర్, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రాఘురామ్ రెడ్డి పేర్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ ముగ్గురిలో కరీంనగర్ నుంచి రాజేందర్‌రావు మాత్రమే ఇప్పటికే నామినేషన్ వేశారు.
అంతేకాక, రాబోయే వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును అధిష్ఠానం ఖరారు చేసింది.
వెంకటేశ్‌కు, పొంగులేటికి ఈయన వియ్యంకుడు
అయితే, కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామి రెడ్డి విషయంలో ఓ ప్రత్యేకత ఉంది. ఈయన ఇద్దరు ప్రముఖులకు వియ్యంకుడిగా ఉన్నారు. సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌కు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రఘురాం రెడ్డి వియ్యంకుడిగా ఉన్నారు. వెంకటేశ్ పెద్ద కుమార్తె అశ్రిత దగ్గుబాటిని రఘురాం రెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి వివాహం చేసుకున్నారు. మరోవైపు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డిని రఘురాం రెడ్డి చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. అలా రఘురామ్ రెడ్డి ఇటు వెంకటేశ్‌కి, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వియ్యంకుడు అయ్యారు.
రామసహాయం రఘురాం రెడ్డి తండ్రి పేరు సురేందర్ రెడ్డి. ఈయన ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. చాలా ఏళ్ల క్రితం ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఇప్పుడు వయోభారం కారణంగా రాజకీయాలకు దూరంగా ఖాళీగానే ఉంటున్నారు. దీంతో ఆయన స్థానంలో కుమారుడు రఘురాం రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.