Revant Party Rumors : రేవంత్ కొత్త పార్టీ అంటూ ప్రచారం - సైబర్ క్రైమ్‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు !
రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై కాంగ్రెస్ నేతలు సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. రేవంత్ పై ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Revant Party Rumors : రేకులపల్లి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ సమాజ కాంగ్రెస్(Telangana Samaj Congress) పార్టీకి రిజిస్ట్రేషన్ చేశారని.. అది రేవంత్ రెడ్డిదేనంటూ కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పార్టీ శ్రేణులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రచారం ఉండటంతో.. టీ కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొత్త పార్టీ ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్ ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై టీపీసీసీ(Telangana Pradesh Congress Party Committee) వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లు ప్రత్యేకంగా రాజకీయం చేస్తున్నారు వారంతా రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రాబల్యం కోసం రాజకీయం చేస్తున్నారని.. ఎన్నికల తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారని ఆరోపిస్తున్నారు. ఇటీవల పార్టీ మారిపోయిన మర్ర శశిధర్ రెడ్డి కూడా అలాంటి ఆరోపణలే చేశారు. ఇప్పుడు దానికి తగ్గట్లుగా తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీని రిజిస్టర్ చేయగానే.. అది రేవంత్ రెడ్డిదేనన్న ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది.ఇతంతా ఇతర రాజకీయ పార్టీల కుట్రలో భాగమని ఆరోపణలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి నిజంగానే పార్టీ పెట్టాల్సి వస్తే..తెలుగుదేశం నుంచి బయటికి వచ్చినప్పుడే పెట్టాల్సిందని కాంగ్రెస్ పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఎందుకంటే కొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో కొత్త పార్టీ పెడితే జనాలకు కనెక్ట్ అవ్వదు. ఇలాంటి టైంలో పెడితే పెద్ద తప్పిదమే అవుతుంది. ఈ విషయం సీనియర్ నాయకుడైనా రేవంత్ రెడ్డి తెలియనిది కాదంటున్నారు. కొందరు కాంగ్రెస్ సీనియర్లే ఇలాంటి వార్తలను ప్రచారం చేయించి తమను బద్నాం చేయాలని చూస్తున్నారని రేవంత్ టీం ఆరోపిస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. రేవంత్ కూడా కాంగ్రెస్ పార్టీకి శ్రమిస్తున్నారు. జనవరి నుంచి పాదయాత్ర కూడా చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలకు రేవంత్ సన్నిహితుడుగా గుర్తింపు పొందారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాల వల్ల .. ఆ పార్టీలో రోజుకో వివాదం వస్తోంది. కొద్ది రోజులు సీనియర్లు వివాదం సృష్టించారు. దిగ్విజయ్ సింగ్ తెలంగాణకు వచ్చి వెళ్లిన తర్వాత వారు సైలెంట్ అయ్యారు. కానీ హఠాత్తుగా రేవంత్ రెడ్డి కొత్త పార్టీ అంటూ ప్రచారం ప్రారంభిచారు. అంతకు ముందు పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు దాడులు చేసినప్పుడు... సీనియర్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని పోలీసులు చెప్పడం కూడా వివాదాస్పదమయింది. ఇప్పుడు రేవంత్ ను టార్గెట్ చేసి.. ఆయనపై హైకమాండ్ కు అనుమానాలు కలిగేలా చేసేందుకు ఇలా సోషల్ మీడియాలో ప్రయత్నిస్తున్నారన్న అనుమానం రేవంత్ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

