SIT Notice Mistakes : ఒకే ఫోన్ తేవాలని ఇద్దరికి సిట్ నోటీసులు - ఫామ్‌హౌస్ కేసు విచారణలో గందరగోళం !
ఫామ్ హౌస్ కేసు విచారణలో ఒకే ఫోన్‌ను ఇద్దరు తేవాలని నోటీసులు జారీ చేయడంపై గందరగోళం ఏర్పడింది. నోటీసులపై స్టే ఇవ్వాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.
SIT Notice Mistakes : తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు .. అనుమానితులకు జారీ చేస్తున్న నోటీసుల్లో గందరగోళం ఏర్పడింది. దాదాపుగా అందరికీ ఒకే తరహా నోటీసులు పంపుతున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ.ఎల్. సంతోష్‌కు సిట్ తాజాగా 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 21న హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. రాకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. బీఎల్ సంతోష్ స్వస్థలం కర్ణాటకలోని ఉడుపి కాగా.. బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్ స్ట్రీట్ చిరునామాతో నోటీసు జారీ అయింది. విచారణకు వచ్చేటప్పుడు 94498-31415 నంబరు సిమ్‌తోపాటు ఐఎంఈఐ నంబరు 353846108969790తో కూడిన సెల్‌ఫోన్‌ను వెంట తీసుకురావాలని సూచించింది.
అయితే కరీంనగర్ కు చెందిన న్యాయవాదికి కూడా సిట్ ఇదే తరహా నోటీసులు జారీ చేసింది. అంటే.. విచారణకు వచ్చేటప్పుడు 94498-31415 నంబరు సిమ్‌తోపాటు ఐఎంఈఐ నంబరు 353846108969790తో కూడిన సెల్‌ఫోన్‌ను వెంట తీసుకురావాలని సూచించింది. ఇద్దరికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న మొబైల్ నంబర్, అందుకు సంబంధించిన ఐఎంఈఐ నంబర్లు ఒకే విధంగా ఉండటంతో సిట్ దర్యాప్తు తేడాగా ఉందని చెప్పడానికి ఇంత కంటే ఏం రుజువు కావాలని బీజేపీ నేతలు ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ ఫోన్ నెంబర్ నుంచే ఎక్కువ సంప్రదింపులు జరిగాయని సిట్ అనుమానిస్తోంది. ఆ ఫోన్‌ను విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు.
అయితే కరీంనగర్‌కు చెందిన న్యాయవాది .. తిరుపతికి చెందిన స్వామిజీ సింహయాజీకి టిక్కెట్ బుక్ చేశారన్న ఆరోపణలపై నోటీసు జారీ చేశారు. ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సన్నిహితుడని చెబుతున్నారు. అదే నోటీస్‌ను పేరు మార్చి బీఎల్ సంతోష్‌కు జారీ చేశారు. నోటీసులు జారీ చేసే క్రమంలో కాపీ పేస్ట్ చేస్తుండగా పొరపాటు జరిగిందా.. లేదా దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్ నంబర్ ఎవరి దగ్గర ఉందో తేల్చుకోవడానికే అలా నోటీసులు పంపించారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. నోటీసులు జారీ చేసిన వారందర్నీ 21వ తేదీనే రావాలని సిట్ ఆదేశించింది.
సిట్ నోటీసులపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నోటీసులపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నోటీసులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ, డీజీపీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తాండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, మొయినాబాద్ స్టేషన్ ఆఫీసర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. నోటీసుల పేరుతో బీజేపీ నేతలను ఇబ్బందులకు గురి చేయాలని సిట్ చూస్తోందని, దీని ద్వారా బీజేపీ ప్రతిష్టతను దెబ్బతీయాలనే కుట్ర చేస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో కేసుతో సంబంధం లేని వారిని సిట్ వేధిస్తోందంటూ ఆరోపించారు.