బీఆర్ఎస్ మేనిఫెస్టో - కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రభావం చూపాయా.?, ప్రజలను ఆకట్టుకునేలా పథకాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను సమాధాన పరిచేలా బీఆర్ఎస్ మేనిఫెస్టోను రూపొందించారు. ప్రస్తుత పథకాలు కొనసాగించడం సహా కొత్త పథకాలను సైతం ప్రకటించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇతర రాష్ట్రాలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు, వాటి అమలు తీరు తెన్నులను దృష్టిలో పెట్టుకుని, అన్ని వర్గాలను ఆకర్షించేలా ఆయన హామీల ప్రకటన చేశారు. 2018లో 3 రోజుల ముందే మేనిఫెస్టో విడుదల చేయగా, ఈసారి 45 రోజుల ముందే మేనిఫెస్టోను ప్రకటించడం విశేషం.
కాంగ్రెస్ ప్రభావం పడిందా.?
తెలంగాణలో మహిళలు, యువత, రైతులు, వృద్ధులే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ 6 హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రధానంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత వంటి పథకాలను అమలు చేస్తామని చెప్పింది. ఈ హామీలను పరిశీలించిన సీఎం కేసీఆర్ ప్రస్తుత పథకాలను కొనసాగించడం సహా కొత్త పథకాలను అమలు చేస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో వివరించారు.
ప్రతిపక్షాలకు సవాల్
ప్రభుత్వ ఆదాయాన్ని పేదలకు పంచడమే తమ లక్ష్యమన్న సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టోను ప్రకటించారు. మహిళలకు నెలకు రూ.3 వేల భృతి, రూ.400కే గ్యాస్ సిలిండర్, రూ.5 లక్షల బీమా సన్న బియ్యం వంటి సంచలన పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ ఆ 6 హామీలు
- 'మహాలక్ష్మి' పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
- 'రైతు భరోసా' కింద ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం, వరి పంటకు అదనంగా రూ.500 బోనస్
- 'గృహజ్యోతి' పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంట్ ఉచితం
- ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం సహా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం.
- పింఛను దారులకు నెలకు రూ.4 వేల పింఛను. 'ఆరోగ్య శ్రీ' కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం.
- ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ.5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం.
బీఆర్ఎస్ హామీలివే
- ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంపు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంపు
- 'సౌభాగ్య లక్ష్మి' పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.3 వేల భృతి. పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్, అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సైతం రూ.400కే గ్యాస్ సిలిండర్.
- రైతు బంధు మొత్తాన్ని రూ.16 వేలకు దశల వారీగా పెంపు. ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు.
- ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలు పెంపు. ఇవే కాకుండా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, రైతు బీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షల జీవిత బీమా, అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ వంటి హామీలను సీఎం కేసీఆర్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు.
- గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు సహా, భవిష్యత్తులో మరిన్ని పథకాలను తెస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రధానంగా మహిళలు, రైతులు, వృద్ధులే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీ సైతం వారికి అనుగుణంగానే కాకుండా అన్ని వర్గాలను సమాధాన పరిచేలా హామీల అమలు ప్రకటన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోటాపోటీగా హామీల అమలు ఉండనున్నట్లు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలను ప్రజలు ఎంత వరకూ ఆమోదించారో తెలియాలంటే ఎన్నికల ఫలితం వరకూ వేచి చూడాల్సిందే.