CM Revanth Reddy: ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు రేడియల్ రోడ్లు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Telangana News: హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ - 2050కు అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy Review Meeting With HMDA Officials: అవుటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (RRR)కు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం హెచ్ఎండీఏ (HMDA), పురపాలక శాఖ అధికారులతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై సమీక్ష జరిపారు. మాస్టర్ ప్లాన్ - 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలను ఓ యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకు రావాలని చెప్పారు. హైదరాబాద్ ఈస్ట్ - వెస్ట్ అనే తారతమ్యాలు లేకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్దేశించారు.
కాగా, తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకువస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో వెల్లడించారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని.. ప్రపంచంతో పోటీ పడుతోందని చెప్పారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్డును త్వరలోనే తీసుకు వస్తామని పేర్కొన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ సదుపాయం కూడా కల్పిస్తామని అన్నారు. త్వరలో విజన్ - 2050 దిశగా తాము ముందుకు వెళ్తున్నామని.. అర్బన్, రూరల్ తెలంగాణను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మహా నగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఇలా 3 భాగాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని వివరించారు. అందుకు అనుగుణంగానే తాజాగా అధికారుల సమీక్షలో ఆదేశాలిచ్చారు.
Also Read: IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం