Telangana News: 24న కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం, పథకాల అమలుపై చర్చించే ఛాన్స్
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి, తొలిసారి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 24న కలెక్టర్లతో భేటీ అవుతున్నారు.
తెలంగాణ (Telangana)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో దూకుడు పెంచుతున్నారు. సీఎంగా తన మార్కు చూపిస్తున్నారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ (Praja Bhavan) గా మార్చేశారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. ఫిర్యాదుల (Complaints) ద్వారా జనం సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. శాఖల వారీగా వరుస బెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక వైపు పాలనలో ప్రత్యేకతను చాటుకుంటూనే, మరోవైపు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 24న కలెక్టర్లతో భేటీ అవుతున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు, కొత్త రేషన్ కార్డుల జారీ, కౌలు రైతుల సమస్యలు, భూ సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు. జిల్లాల కలెక్టరతో గురువారం సమీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా పడింది.
సమాచారంతో రండి
ఆదివారం జరిగే సమావేశంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై సమాచారం సిద్ధం చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి, ఇళ్లు కట్టుకోలేని పేదలకు రూ.5లక్షల ఆర్థికసాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల పంపిణీ కోసం మార్గదర్శకాలపై కలెక్టర్లతో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. ప్రధానంగా మేనిఫోస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై కలెక్టర్లతో మాట్లాడనున్నారు.
ప్రజావాణి జిల్లాలకు విస్తరణ
ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునేందుకు ప్రగతి భవన్ కు జనం క్యూకడుతున్నారు. ఊహించని విధంగా స్పందన వస్తుండటంతో, దీన్ని జిల్లాలకు విస్తరించాలన్న భావిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లాల్లో నిర్వహించడంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏయే రోజుల్లో నిర్వహించాలన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా ప్రతి వారం నిర్వహించేలా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుపై ఒకవైపు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన ప్రభుత్వం....మిగిలిన వాటి అమలు, నిధులపై లెక్కలు వేసుకుంటోంది. 5వందల గ్యాస్ సిలిండర్, మహిళలకు 2వేల 500 నగదు బదిలీ, పెన్షన్ల పెంపు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల నగదుసాయం, కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటు పార్టీ, అటు ప్రభుత్వం తరపున ప్రతినిధులను నియమించి గ్రామ సభలను నిర్వహించనుంది. గ్రామసభ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, అందరి ఆమోదం తెలిపిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనుంది. పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించనుంది ప్రభుత్వం.