డబుల్ డెక్కర్ కారిడార్ శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్, ట్రాఫిక్ కష్టాలకు చెక్!
Telangana News: హైదరాబాద్ ప్రజల ట్రాపిక్ కష్టాలను తీర్చే ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
CM Revanth Laid The Foundation Stone Of The Double Decker Corridor : హైదరాబాద్ ప్రజల ట్రాపిక్ కష్టాలను తీర్చే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కండ్లకోయ వద్ద ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. రూ.1580 కోట్ల వ్యయంతో 5.32 కిలో మీటర్లు మేర జాతీయ రహదారి-44పై ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్ పల్లి మీదుగా ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఈ కారిడార్ నిర్మాణంతో సికింద్రాబాద్‌లో పూర్తిగా ట్రాఫిక్ ఇక్కట్లు తొలగనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కారిడార్ పూర్తయితే మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు రవాణా సేవలు మరింత మెరుగుపడనున్నాయి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతోంది. రద్దీని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.. డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
రూ.1580 కోట్లతో నిర్మాణం
జాతీయ రహదారి-44పై సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్‌బంద్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డైరీ ఫాం రోడ్డు వరకు ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. మొత్తం 5.32 కిలో మీటర్లు కారిడార్ పొడవు కాగా, 4.65 కిలో మీటర్లు మేర ఎలివేటెడ్ కార్డిఆర్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.60 కిలో మీటర్లు ఉంటుంది. మొత్తంగా 131 పియర్స్(స్థంబాలు) ఉంటాయి. ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా రెండు చోట్ల ర్యాంపులు నిర్మించనున్నారు. ఇది పూర్తయిన తరువాత ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రోమార్గం నిర్మించనున్నారు. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణం మరింత క్షేమంగా, వేగంగా, సుఖవంతంగా సాగేందుకు అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాతంలో ప్యారడైజ్ జంక్షన్ వద్ద రోజూ సగటున 1,57,105 వాహనాలు ప్రయాణిస్తున్నారు. ఓఆర్‌ఆర్ జంక్షన్ సమీపంలో అయితే 72,687 వాహనాలు వెళుతున్నాయి. ప్రస్తుతం ఈ దారి ఇరుగ్గా ఉండడంతో ట్రాఫిక్ స్తంభించిపోతూ వాహనదారులు, ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యలకు ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే పరిష్కారం లభించనుంది.