CM KCR Speech: రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా?- సీఎం కేసీఆర్ ఫైర్
CM KCR Speech: ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటున్న రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
CM KCR Speech: ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటున్న రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ధర్మపురిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ధరణి పోర్టల్ రాక ముందే అనేక భూమి గొడవలు ఉండేని, ధరణి వచ్చాక రైతుల భూములు భద్రంగా ఉన్నాయని అన్నారు. ధరణితో దళారీలు, లంచాలు లేకుండా మండల కేంద్రాల్లోనే వెంటనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చెప్పారు.
నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ కోసం పుట్టిందే బీఆర్ఎస్ అని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయినా ప్రజాస్వామ్యానికి రావాల్సిన పరిణతి రావట్లేదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో నిలబడే వ్యక్తుల వెనుక ఉండే పార్టీల చరిత్ర ఏంది? ఏం చేసింది? ప్రజల గురించి ఆ పార్టీ నడవడిక ఏంది? ఆ పార్టీ దృక్ఫథం ఏంది? అనే విషయాలపై చర్చ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రజలు గెలిచే వరకు సరైన అభివృద్ధి లేకుండా ఉంటుందన్నారు.
ఓటు వజ్రాయుధమని, తలరాతను మారుస్తుందని అన్నారు. ఎన్నోసార్లు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చినా చేసిందేమీ లేదని, కానీ మరో సారి ఛాన్స్ ఇవ్వండని అడుగుతుతోందని విమర్శించారు. కొప్పుల ఈశ్వర్ గెలిచాక ధర్మపురి ఎలా అభివృద్ధి చెందింది? అంతకు ముందు ఎలా ఉందో గమనించాలని కోరారు. టెయిల్ ఎండ్ కాలువలు, ప్రాజెక్టులు, నీళ్లు, చాలా అభివృద్ధి పనులను కొప్పుల పూర్తి చేయించారని కొనియడారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికలు తీసుకుంటే భూగర్భ జలాలు పెరిగాయని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ఏర్పడ్డప్పుడు రాష్ట్రంలో అంతా అస్తవ్యస్తంగా ఉండేదని, అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతుండేవని అన్నారు. కొత్త రాష్ట్రంలో నాడు కరెంటు, మంచినీళ్లు, సాగునీరు లేదని, ప్రజలు వలస వెళ్లేవారని, ఎక్కడ చూసినా అంధకారం ఉండేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచినీళ్ల సమస్య లేదని, దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని చెబితే తాము పెట్టలేదని ఫలితంగా తెలంగాణకు రావాల్సిన రూ.25 వేల కోట్లను మోదీ ఇవ్వలేదని విమర్శించారు.
విద్యారంగంలో అన్ని వర్గాల ప్రజలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకున్నామని గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేయాలని ఆలోచించలేదని విమర్శించారు. దేశంలో ‘రైతు బంధు’ను సృష్టించిందే తానేనని కేసీఆర్ చెప్పారు. గతంలో రాబంధులు తప్ప ‘రైతు బంధు’ లేరని అన్నారు. నేడు రైతు బంధుతో రైతులందరూ అప్పులు, దళారుల బాధ లేకుండా సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి ఉచిత కరెంటును ఇస్తూ, ధాన్యాన్ని మొత్తం కొంటున్నట్లు తెలిపారు.
ప్రమాదవశాత్తూ రైతులు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా అందిస్తున్నట్లు చెప్పారు. రైతులు పంట అమ్మితే వచ్చే డబ్బులు డైరెక్ట్‌గా వారి బ్యాంక్ అకౌంట్లలో పడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తే రైతులకు వచ్చే రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోలు డబ్బులు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యమే పైరవీకారులు, దళారుల రాజ్యం అని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తారని హెచ్చరించారు. గతంలో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే రైతుల దగ్గర రెండు వేలు, మూడు వేలు వసూలు చేసేవారని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు
కొప్పుల ఈశ్వర్ 80 వేల మెజార్టీతో గెలువగానే ధర్మపురి నియోజకవర్గం మొత్తానికి దళిత బంధును ఒక్కసారిగా మంజూరు చేస్తానని కేసీఆర్ అన్నారు. తరతరాలుగా దోపిడీ, అణిచివేతలకి గురైన దళితుల సంక్షేమం కోసమే దళిత బంధును పెట్టినట్లు చెప్పారు. దేశంలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి కూడా దళిత బంధు లాంటి పథకం గురించి ఆలోచించలేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రామాణికమైన తలసరి ఆదాయం, విద్యుత్ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వివరించారు.
కుల మతాలు చూడకుండా అందర్నీ కలుపుకుంటూ పదేళ్లలో అనేక రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా చేశామని కేసీఆర్ అన్నారు. ధర్మపురి ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధుల్ని కేటాయిస్తామని చెప్పారు. కొప్పుల ఈశ్వర్ ను గెలిపిస్తే ధర్మపురి నియోజకవర్గం మరింత అభివృద్ధిని సాధిస్తుందని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాడు గోదావరంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే విజయవాడనే ఉండేదని, ధర్మపురిలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని తాను డిమాండ్ చేసేదాక ఇక్కడున్న ఏ నాయకులకు ఆ సోయి లేకపోయిందని గుర్తు చేశారు.