KCR Cheneta Bandhu: తెలంగాణలో మరో "బంధు"... ఈ సారి చేనేత కార్మికులకు వరాలు..!
దళితబంధు తరహాలోనే చేనేత బంధు పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 70వేల మంది లబ్దిదారులను గుర్తించినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం "దళిత బంధు" పథకం రేపుతున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ తరహా పథకాన్ని మరింత మందికి విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితాలోకి తర్వాత చేరబోయేది చేనేత కార్మికుల పథకమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చేనేత బంధు పథకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇలాంటి పథకం తీసుకువస్తామని కేసీఆర్ గతంలోనే తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా "నేతన్నకు చేయూత"పథకాన్ని ఈ రోజు నుంచి తెలంగాణ సర్కార్ మళ్లీ ప్రారంభిస్తోంది. ఈ పథకం కింద.. కార్మికులు 8 శాతం నిధులు జమ చేస్తే చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం మరో 16 శాతం నిధులను కలిపి ఇస్తుంది.
బడ్జెట్‌లో రూ. 338 కోట్లు కేటాయించగా నాలుగు రోజుల క్రితం ఈ పథకానికి మరో రూ. 30 కోట్లు అదనంగా విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఈ పథకం కింద 26 వేల మందికిపైగా కార్మికులు పేర్లు నమోదు చేసుకొని రూ. 31 కోట్లు పొదుపు చేయగా ప్రభుత్వం రూ. 62 కోట్లు తన వంతు వాటాగా చెల్లించింది. అలాగే చేనేతలను ఆదుకునేందుకు మరికొన్ని సంస్కరణలను తీసుకు రావాలని నిర్ణయించారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖకు అనుబంధ విభాగంగా ఉన్న చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం ఉంది. అలా ఉండటం వల్ల.. పరిశ్రమ కేటగరిలోకి వస్తోంది. దీని వల్ల వారికి చాలా ప్రయోజనాలు అందడం లేదు.
"నేతన్నకు చేయూత"మాత్రమే కాకుండా.. దళిత బంధు తరహాలోనే చేనేత బంధు పథకాన్ని అమలు చేసే దిశగా కేసీఆర్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం అధికారులు వివరాలన్నీ సేకరించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసుగల సుమారు 70 వేల మందిని లబ్దిదారులుగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. సహకార రంగంతోపాటు సహకారేతర రంగం వారికి కూడా చేనేతబంధు పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకం కింద ఎంత మేర ఆర్థిక సాయం చేస్తారన్నదానిపై త్వరలోనే స్పష్టత రానుంది. అలాగే చేనేత బీమా పథకాన్ని కూడా అమలు చేస్తారు.
తాను ప్రవేశ పెట్టే పథకాలతో రాజకీయ లబ్ధి చేకూరినా, లేకపోయినా ఓ వర్గానికి మేలు చేస్తాయని సీఎం కేసీఆర్ నిర్మోహమాటంగా చెప్పుకుంటారు. రాజకీయ పార్టీలన్నీ మరింత మందిని ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలే చేస్తాయి. కానీ అంగీకరించరు. కానీ కేసీఆర్ మాత్రం ఇందుకు భిన్నంగా నిర్మోహమాటంగా చెప్పి చేస్తుంటారు. చేనేత వర్గాలకు కూడా దళిత బంధు తరహాలో పథకం అమలు చేస్తే వారిలో టీఆర్ఎస్‌కు మరింత ఆదరణ పెరుగుతుందన్న వ్యూహం అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.