CJI NV Ramana : జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు మోక్షం - కేసును పరిష్కరించిన జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం !
హైదరాబాద్‌లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపుపై దాఖలైన పిటిషన్లను సీజేఐ ధర్మాసనం పరిష్కరించింది. జర్నలిస్టుల స్థలాన్ని స్వాధీనం వారికి స్వాధీనం చేయాలని ఆదేశించింది.
CJI NV Ramana : పదవీ విరమణ చేయబోతున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు జర్నలిస్టులకు తీపి కబురు చెప్పారు. జర్నలిస్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న స్థల వివాదాన్ని పరిష్కరించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని స్పష్టం చేసింది.
పుష్కర కాలంగా ఇళ్ల స్థలాల వివాదం సుప్రీంకోర్టులో
జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదని... ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలని ఎన్వీ రమమణ అభిప్రాయపడ్డారు . రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నామని.. వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదన్నారు. వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారని..జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నాంమని సీజేఐ ఎన్వీ రమణ ప్రకటించారు. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చునన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయమని రిజిస్ట్రీని ఆదేశించారు.
ఉమ్మడి ఏపీలో స్థలాల కేటాయింపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 12 ఏళ్ళ కిత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు జర్నలిస్టులకు హైదరాబాద్ లో ఇళ్ళ స్థలాల కోసం స్థలాన్ని కేటాయించారు. అప్పుడు అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు చాలా మంది డబ్బులు కట్టారు. అయితే, తర్వాత స్థలం కేటాయింపు విషయంలో కోర్టుల్లో పలు కేసులు నమోదయ్యాయి. చివరికి సుప్రీంకోర్టు చేరింది.అప్పటి నుండి న్యాయస్థానాల సానుకూల స్పందన కోసం జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు స్థలాల కేటాయింపుపై హామీ ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున ఏమీ చేయలేకపోతున్నామని చెప్పేవారు. ఇప్పుడు సుప్రీంకోర్టు... జర్నలిస్టుల విషయంలో సానుకూలంగా స్పందిస్తూ తీర్పును వెల్లడించింది.
ఎన్వీ రమణ చొరవతో ఇళ్ల స్థలాలు పొందనున్న జర్నలిస్టులు
జర్నలిస్టులు హౌసింగ్ సొసైటీకి డబ్బులు కట్టి సుదీర్ఘ కాలంగా వడ్డీలు కట్టుకుంటున్నారు. కొంత మందికి డబ్బులు వెనక్కి ఇచ్చారు. ఇప్పుడు స్థలాల్లో నిర్మాణం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పినందున జర్నలిస్టులకు ఓ గూడు లభించే అవకాశం కనిపిస్తోంది.ప్రధానంగా జర్నలిస్టులకు జవహార్‌లాల్ హౌజింగ్ సొసైటీ పేరుతో స్థలాలను పొందేందుకు దరఖాస్త ుచేసుకున్నారు. దాదాపు హైదరాబాద్‌కు చెందిన 1200 మంది జర్నలిస్టుల వరకు 13 కోట్లు ప్రభుత్వానికి కట్టారు. మొత్తం 70 ఎకరాలు కేటాయించారు. అయితే వాటిలో 30 ఎకరాలు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి ఇచ్చారు. కోర్టుల్లో కేసులు తేలకపోవడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర చోట్ల స్థలాలు కేటాయించాలనే ప్రయత్నం చేశారు. డబుల్ బెడ్ రూం లు కట్టిస్తామని చెప్పారు. హైదరాబాద్ శివారులో ఓ స్థలాన్ని చూసి రమ్మని జర్నలిస్టు నేతలకు కూడా చెప్పారు. అయితే తర్వాత ముందుకు సాగలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమస్య పరిష్కామయినట్లయింది.