Bandi Sanjay: 'బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు' - కేసీఆర్ బాటలోనే రేవంత్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Telangana News: బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చే కుట్రకు ప్రభుత్వం తెర తీస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.
Central Minister Bandi Sanjay Sensational Comments: కాంగ్రెస్ ప్రభుత్వం బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు రూ.వేల కోట్లు అప్పులు తెచ్చే కుట్రకు తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపైనా (CM Revanth Reddy) విమర్శలు చేశారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడం వల్ల రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుబోతోందని అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు కలిపి గాడిద గుడ్డు.. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు = గాడిద గుడ్డే అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర పన్నుతున్నారని.. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
'కేసీఆర్ బాటలోనే సీఎం'
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ బాటలోనే నడుస్తున్నట్లుగా ఉందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. 'తెలంగాణకు సీఎం తీరుతో పెద్ద నష్టం. భారత్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడం, కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతమే నీతి ఆయోగ్ సమావేశ ముఖ్య లక్ష్యం. పచ్చి అబద్దాలతో కేంద్రాన్ని బద్నాం చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన సీఎంకు ముఖం లేకనే నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని, పిల్లర్లు దెబ్బతిన్నాయని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది కదా?. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు అవకాశవాదులు.' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
'కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం'
అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్‌లో విలీనం కావడం ఖాయమని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అసెంబ్లీలో రెండు పార్టీలు కలిసే బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానం చేసింది నిజం కాదా?. లోలోపల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఆలింగనం చేసుకుంటున్నారు... బయటకొచ్చి తిట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతల వార్నింగులను జనం అసలు పట్టించుకోవడమే లేదు. కాళేశ్వరంపై రెండు పార్టీలు కలిసి డ్రామాలాడుతున్నాయి. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు హీరోల్లా కొట్లాడుతుంటే... తట్టుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కైనయ్. మూసీ రివర్ ఫ్రంట్ నిధులడిగిన రాష్ట్ర ప్రభుత్వం... బడ్జెట్‌లో ఎందుకు భారీగా నిధులు కేటాయించలేదో సమాధానం చెప్పలేదు?. కాళేశ్వరం ఆలయ సంప్రదాయాలు పాటించకుండా బీఆర్ఎస్ నేతలు గర్భగుడిలోకి వెళ్లడం దుర్మార్గం. కేటీఆర్ నాస్తికుడు...హిందూ సనాతన ధర్మాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్నారు. దేవుడిని అవమానించడం తప్ప బీఆర్ఎస్ నేతలు సాధించిందేమిటి? బీఆర్ఎస్ నేతలు తక్షణమే తెలంగాణ ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే.' అంటూ బండి సంజయ్ విమర్శించారు.
Don’t believe fake propaganda of Congress or BRS.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 27, 2024
Central govt allocated ₹10lakh crore to Telangana in 10years pic.twitter.com/gfDstsYtdy
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. గత పదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు కేటాయించినట్లు బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.