KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Telangana News: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యానించారని ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.
KTR Defamation Suit Against Minister Konda Surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR).. మంత్రి కొండా సురేఖపై (Konda Surekha) పరువు నష్టం దావా వేశారు. ఆయన తరఫు న్యాయవాది ఉమమహేశ్వరరావు నాంపల్లి ప్రత్యేక కోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యానించారని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇటీవలే హీరో నాగార్జున మంత్రి సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.
ఇప్పటికే లీగల్ నోటీసులు
కాగా, ఫోన్ ట్యాపింగ్ సహా సమంత, నాగచైతన్య విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. తనపై అసత్య ఆరోపణలు చేశారని.. సంబంధం లేని విషయాల్లో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తన గౌరవానికి, ఇమేజ్‌కు భంగం కలిగించాలనే లక్ష్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతో, తన ప్రయోజనాల కోసమే తన పేరును వాడుకుంటున్నారని.. మహిళ అయి ఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరమని అన్నారు. 'ఒక మంత్రిగా కొండా సురేఖ మంత్రి హోదాని దుర్వినియోగం చేశారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆమె చేసిన అసత్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడనే సోయి లేకుండా మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసింది. అబద్ధాలు, అసత్యాలు మాట్లాడినందుకు ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలి.' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కోర్టు నోటీసులు
మరోవైపు, ఈ వ్యవహారంలో సినీ నటుడు నాగార్జున సైతం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య - సమంత విడాకుల అంశంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు విచారణ సందర్భంగా నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని కోర్టు ఆదేశించడంతో.. నాగార్జున, అమల, నాగచైతన్య నాంపల్లి కోర్టుకు మంగళవారం హాజరయ్యారు.
అటు, కొండా సురేఖ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు సైతం ఖండించారు. ఆధారాల్లేని వ్యాఖ్యలు చేస్తే మౌనంగా ఊరుకోమని.. ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయంశక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం అని కూడా పేర్కొన్నారు.