Telangana Formation Day: నేటి నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తెలంగాణ అవతరణ వేడుకలు
Telangana Formation Day 2024: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా కార్యక్రమాల జాబితాను ఆ పార్టీ పెద్దలు సిద్ధం చేశారు.
![Telangana Formation Day: నేటి నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తెలంగాణ అవతరణ వేడుకలు BRS To Celebrate Telangana Formation Day Celebrations For 3 Days Telangana Formation Day: నేటి నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తెలంగాణ అవతరణ వేడుకలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/76f3f54d6cf56b5d790b0ab30a656b3d1717213389878798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Formation Day Celebrations: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి సన్నాహాలు చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి 3 తేదీ వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కార్యక్రమాల జాబితాను ఆ పార్టీ పెద్దలు సిద్ధం చేశారు. గత ఏడాది బీఆర్ఎస్ అధికారంలో ఉండగా దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించింది. డిసెంబర్‌లో అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో పార్టీ పరంగా ముగింపు ఉత్సవాలను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
నందినగర్ నివాసానికి కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో బీఆర్‌ఎస్ పాత్ర ప్రతిబింబించేలా వేడుకల నిర్వహణకు ఆ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా కేసీఆర్ శుక్రవారం ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రాష్ట్ర అవతరణ రోజు నిర్వహించనున్న కార్యక్రమాల గురించి పార్టీ నేతలతో సమీక్షించారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో సమావేశమై జూన్ 2న చేపట్టబోయే కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.
నేడు బీఆర్ఎస్ ర్యాలీ
తెలంగాణ అవతరణ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరుల స్తూపం వద్ద నేతలతో కేసీఆర్ నివాళి అర్పిస్తారు. అనంతరం గన్‌పార్కు నుంచి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, ఇతర తెలంగాణ కళారూపాలతో వేయి మందికి పైగా కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.
ఈ ర్యాలీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వం వహిస్తారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన న్యాయవాదులు, డాక్టర్లు, పాటు వివిధ వర్గాలకు చెందిన వారు ర్యాలీ పాల్గొంటారు. రవీంద్రభారతి, రిజర్వు బ్యాంకు కార్యాలయం మీదుగా ర్యాలీ సాగనుంది. ట్యాంకుబండ్ వద్ద అంబేడ్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణ అమరజ్యోతి వద్ద ముగియనుంది. అక్కడ తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు వందలాది మంది కవి గాయకులు నివాళులర్పిస్తూ బృందగానం చేస్తారు.
రేపు తెలంగాణ భవన్‌లో వేడుకలు
బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జాతీయ పతాకం, బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేస్తారు. 9.30కు తెలంగాణ భవన్ సమావేశ మందిరంలో ‘తెలంగాణ యాది’ పేరిట ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను అమరుల కుటుంబాల చేతుల మీదుగా ప్రారంభిస్తారు. 11 గంటలకు తెలంగాణ భవన్‌లో నాయకులు, కార్యకర్తలతో జరిగే సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తారు. కార్యక్రమానికి వచ్చే నాయకులు, పార్టీ కేడర్ కోసం మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
చివరి రోజు జిల్లా కేంద్రాల్లో..
తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల చివరి రోజు జిల్లా కేంద్రాల్లో వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. 3వ తేదీన జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలు, మినీ తెలంగాణ భవన్లలో జాతీయ పతాకం, పార్టీ జెండాను ఎగురవేయాలని అధిష్టానం ఆదేశించింది. అంతేకాకుండా స్థానికంగా పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)