Governer RTC Bill : న్యాయపరిశీలనకు ఆర్టీసీ బిల్లు - గవర్నర్‌పై బీఆర్ఎస్ ఆగ్రహం !
ఆర్టీసీ బిల్లును గవర్నర్ న్యాయ పరిశీలనకు పంపడంతో బీఆర్ఎస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
Governer RTC Bill : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. ఈ నెల 11వ తేదీన ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం లభించిన బిల్లును గవర్నర్ గురువారం మళ్లీ న్యాయశాఖ పరిశీలనకు పంపారు. ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్థిక బిల్లు కావడంతో మొదట గవర్నర్ అనుమతి అవసరం అయింది. అయితే గవర్నర్ పలు రకాల వివరణలు అడిగిన తర్వాత అసెంబ్లీ సమావేశాల చివరిరోజు బిల్లుకు అనుమతించారు. చివరి రోజు. బిల్లును హడావుడిగా అసెంబ్లీ ఆమోదించింది.
ఆర్టీసీ సహా నాలుగు బిల్లులను న్యాయసలహా కోసం పంపిన గవర్నర్
శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు తిరిగి గవర్నర్ ఆమోదం కోసం ఈ నెల 11న గవర్నర్‌కు పంపారు. దీనితో పాటు గతంలో గవర్నర్ తిప్పిపంపిన నాలుగు బిల్లులను కూడా అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి తిరిగి గవర్నర్ ఆమోదానికి పంపారు. తాజాగా ఆ బిల్లులన్నింటినీ గవర్నర్ న్యాయశాఖ పరిశీలనకు పంపారు. ఈ అంశంపై రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ కార్మికుల భద్రత, సంక్షేమం కోసమే న్యాయశాఖ వివరణ కోరినట్టు తెలిపింది. ఆర్టీసీ బిల్లుతో పాటు ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ఆమోదం తెలిపి పంపిన నాలుగు బిల్లుల్ని గవర్నర్ న్యాయశాఖ కార్యదర్శికి పంపారు.
కార్మికులకు న్యాయం జరగాలనే న్యాయసలహా తీసుకుంటున్నామన్న రాజ్ భవన్
వర్నర్ గతంలో వెనక్కి పంపినపుడు ఆ 4 బిల్లులపై చేసిన సిఫార్సులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశం గురించి కూడా గవర్నర్ అడిగారు. ఆర్టీసీ బిల్లుతో సహా ఇతర బిల్లుల విషయంలో తాను చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? నిర్ధారించాలని కోరారు. న్యాయశాఖ కార్యదర్శి నుంచి అందే సమాచారం ఆధారంగా బిల్లులపై గవర్నర్ తదుపరి చర్యలు తీసుకోనున్నారు. రాజకీయ దురుద్దేశంతో బిల్లుల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలు నమ్మవద్దని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
అన్నీ పరిశీలించే ఆమోదం ఇచ్చారంటున్న బీఆర్ఎస్
ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేముందే మూడు రోజుల పాటు ఆపారని, ప్రభుత్వ వివరణ తరువాత సభలో ప్రవేశపెటేందుకు సమ్మతించారని, ఉభయ సభల్లో ఆమోదించిన అదే బిల్లుకు పది రోజులు దాటినా ఎందుకు ఆమోదముద్ర వేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్, కేంద్రం కనుసన్నల్లో మెలుగుతూ కేవలం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు ఆటంకాలు కల్పిస్తున్నట్టుగా కనిపిస్తున్నదని విమర్శిస్తున్నారు.