BRS Reaction On Chandrababu : తెలంగాణపై కుట్రతోనే రాజకీయాలు - చంద్రబాబుపై బీఆర్ఎస్ నేతల ఘాటు విమర్శలు !
చంద్రబాబుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. ఆయనను తెలంగాణ ప్రజలు ఆదరించరని స్పష్టం చేశారు.
BRS Reaction On Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించడంపై బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలుతీవ్ర విమర్శలు గుప్పించారు. ఖమ్మం తన వల్లే అభివృద్ధి చెందిందని చంద్రబాబు చెబుతున్నారని.. కానీ ఆయన వల్లే తెలంగాణకు మొదటి నష్టం జరిగిందని మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరానికి ఏడు మండలాలు గుంజుకున్నారని.. 440 మెగావాట్ల సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏపీలో కలుపుకున్నారని ఆరోపించారు. ఖమ్మం లో ఒక్క సాగు నీటి ప్రాజెక్ట్ కట్టా అని చంద్రబాబు నిరూపిస్తే నేను ముక్కు నేల కు రాస్తానని పువ్వాడ అజయ్ సవాల్ చేశారు. ఖమ్మం కు ఐటీ తెచ్చింది కేసీఆర్, కేటీఆర్‌లేననన్నారు. కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నాం.. మమ్మల్ని బాబు ఆగం చేయొద్దని పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సభ పెట్టిన గ్రౌండ్ చాలా చిన్నదని.. ఏపీ నుంచి జనాలను తరలించారని ఆరోపించారు.
చంద్రబాబుపై తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది : హరీష్ రావు
కేసీఆర్ ను ఎదుర్కునేందుకు బీజేపీ రకరకాల ప్రయోగాలు చేస్తోంది ..ఇపుడు బీజేపీ పంపుతున్న నేతల జాబితా లో చంద్రబాబు చేరిపోయాడని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఖమ్మం లో చేసిన షో కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టు ఉందన్నారు. ఏపీని అప్పుల పాలు చేసి ఓటర్ల ఛీత్కారానికి గురైంది చంద్రబాబు కాదా అని హరీష్ ప్రశ్నించారు. తెలంగాణ ను అత్యంత వెనకబడేలా చేసింది చంద్రబాబు అన్నారు. చంద్రబాబు పట్ల తెలంగాణ ప్రజలకు పూర్తి స్పష్టత ఉందన్నారు. చంద్రబాబు లా మాట్లాడితే తమ దేశం లో నైతే జైలు కు పంపుతారు అని అప్పటి స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అన్నారని.. కరెంటు చార్జీలు తగ్గించమంటే బషీర్ బాగ్ లో రైతులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారన్నారు. ఏపీలో చెల్లని రూపాయి చంద్రబాబు తెలంగాణ లో చెల్లుతుందా అని ప్రశ్నించారు. ఏపీ లో బీజేపీ తోటీడీపీ పొత్తు కోసమే తెలంగాణ లో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. 2018 లో తెలంగాణ పై మహాకూటమి తో కుట్ర చేశారు.. ఇపుడు ఖమ్మం సభ తో కుట్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు తో తెలంగాణ దృష్టి తోనే అప్పట్లో పొత్తు పెట్టుకున్నామన్నారు. తెలంగాణ పై కేసీఆర్ కున్న ప్రేమ చంద్ర బాబుకు ఎలా ఉంటుందని.. గుజరాత్ లో మోడీ ని అక్కడ ఆ రాష్ట్ర ప్రజలు తమ వాడిగా భావించి గెలిపించారు,..తెలంగాణ లో కేసీఆర్ నే ప్రజలు తమ నాయకుడిగా భావిస్తారని హరీష్ రావు స్పష్టం చేశారు.
ఖమ్మంలో కూడా జై తెలంగాణ అని చంద్రబాబు అనలేదు : శ్రీనివాస్ గౌడ్
నాడు తెలంగాణ పదాన్ని నిషేధించిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఉద్యోగులను రాచి రాంపాన పెట్టాడని.. నిరుద్యోగుల పొట్ట కొట్టారని విమర్శించారు. పాలమూరు పేరు చెప్పుకుని ప్రపంచబ్యాంకు నుంచి రుణం తెచ్చి.. తెలంగాణ వాదాన్ని అణచి వేశారని విమర్శించారు. అంగన్ వాడీ వర్కర్ల ను గుర్రాలతో తొక్కించారన్నారు. ఖమ్మంలో కూడా చంద్రబాబు జై తెలంగాణ అనలేదన్నారు. బాబు ను చూస్తే పంచతంత్ర లోని పులి బాట సారి బంగారు కడియం కథ గుర్తొస్తుందన్నారు. పులి చేతిలో మోసపోయే బాటసారి కాదు నేటి తెలంగాణ అని స్పష్టం చేశారు.
టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవు : కవిత
ఇక నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత కూడా చంద్రబాబు ఖమ్మం సభపై స్పందించారు. చుక్కలు ఎన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణ లో కేసీఆర్ ఒక్కడే అని కవిత స్పష్టం చేశారు. టిడిపి రాజకీయాలు తెలంగాణలో చెల్లవన్నారు. చంద్ర బాబు వచ్చి మళ్లి ఇక్కడ పార్టీ ని రివైవ్ చేయాలి అనుకుంటున్నాడనీ వాళ్లు తెలంగాణ బాగును కోరిన వాళ్ళు కాదనీ స్పష్టం చేశారు. వాళ్ళను తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేశారని.. ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దాం అనుకున్న మళ్లి రిజెక్ట్ చేస్తారన్నారు.
తెలంగాణ సంపదపై కన్నేసి వస్తున్నారు : గంగుల కమలాకర్
కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన గంగుల కమలాకర్ ... చంద్రబాబు పాత బిడ్డల్లారా రండి అని పిలుపునిస్తున్నారని.. మళ్లీ రాష్ట్రాన్ని కలపాలన్నదే అసలు ఎజెండా అని మండిపడ్డారు. మళ్లీ 1956 నవంబర్ 1 గుర్తుకు తెస్తున్నారని అన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే చంద్రబాబు ఎంట్రీ అని విమర్శించారు. మీ మూలాలు ఎక్కడ? ఏపీ మూలాలున్న మీకు తెలంగాణ గడ్డపై ఏం పని అని గంగుల కమలాకర్ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు జూన్ 2నే ఏర్పడినా చంద్రబాబు ఆ రోజు ప్రమాణం చేయలేదని.. ఖమ్మం నుంచి ఏడు మండలాలు కలిపేదాకా ప్రమాణం చేయనన్న వ్యక్తి చంద్రబాబని గంగుల మండిపడ్డారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న ఏపీ పార్టీల వెనుక బీజేపీ ఉందన్నారు. మన రాష్ట్ర సంపదపై కన్నేసి వస్తున్నారని.. హైద్రాబాద్ సంపదను, మన నీళ్లను ఎత్తుకుపోయే కుట్రలో భాగమే ఇదంత అని గంగుల కమలాకర్ ఆరోపించారు. తెలంగాణ రక్తం ఉన్న వాళ్లెవరూ చంద్రబాబు పార్టీలో చేరరన్నారు. బీఆర్ఎస్ తో మేము దేశమంతా పోతుంటే.. తెలంగాణ మీదకే వీళ్లంతా ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు పార్టీ నేతల్ని.. క్యాడర్‌ని పట్టించుకోలేదు : ఎర్రబెల్లి
మళ్లీ పాత నేతలందరూ టీడీపీలోకి రావాలని పిలుపునిచ్చిన చంద్రబాబుపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గతంలో ప్రజలను నాయకులను ,పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు అభివృద్ధి చెయ్యలేదు.. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు.