BRS MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్‌కు కోర్టు ఓకే - తల్లి, కొడుకులను కలిసేందుకు అనుమతి
Telangana News: ఎమ్మెల్సీ కవిత తన తల్లి, కుమారులను కలిసేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరగా, అందుకు న్యాయస్థానం అనుమతించింది.
BRS MLC Kavitha: ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టు 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించడం తెలిసిందే. ఈ వారం రోజులపాటు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు కొందరితో ములాఖత్ అయ్యేందుకు కవితకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇదివరకే రెండు రోజులు కేటీఆర్, హరీష్ రావు ఈడీ విచారణ ముగిశాక సాయంత్రం కవితను కలిసి విచారణపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో తన తల్లి, కుమారులను కలిసేందుకు అనుమతివ్వాలని ఎమ్మెల్సీ కవిత న్యాయస్థానాన్ని కోరారు.
మొత్తం 8 మందిని కలుసుకునేందుకు ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. తొలిరోజు నలుగుర్ని, రెండో రోజు మిగతా నలుగుర్ని కలుసుకునేందుకు కవితకు ఢిల్లీ కోర్టు నుంచి అనుమతి లభించింది. మంగళవారం సాయంత్రం తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్యతో పాటు మరొకరితో ములాఖత్ కానున్నారు. బుధవారం సాయంత్రం మరో నలుగుర్ని కవిత కలుసుకోనున్నారు. కోర్టు అనుమతితో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు తన సన్నిహితులతో కవిత ములాఖత్ కానున్నారు.
కవితకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన కవితకు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఓ లేఖ రాశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, రాజకీయ కక్షసాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలేనని కవిత అరెస్టుతో తేలిందన్నారు. నిజం బయటికొచ్చిందని.. చేసిన పనుల కర్మ ఫలం ఇప్పుడూ వెంటాడుతోందని అన్నారు. నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరూ ఏమి చేయలేరని అనుకునేవారు. కానీ భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైందని లేఖలో చెప్పుకొచ్చారు.