Kavitha: సీబీఐ విచారణకు అనుమతి - రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్
Telangana News: ఢిల్లీ లిక్కర్ కేసులో తనను ప్రశ్నించేందుకు ప్రత్యేక కోర్టు సీబీఐకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
Brs Mlc Kavtiha Petition Against Cbi Questioning: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో రోజుకో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha), ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా, కవితను ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో శుక్రవారం పిటిషన్ వేయగా.. అందుకు అనుమతించింది. ఈ క్రమంలో కవిత దీనిపై రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు అనుమతిచ్చిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టులో ఆమె తరఫు న్యాయవాది నితీష్ రాణా ప్రస్తావించారు. సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని.. కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. కవిత పిటిషన్ పై ఎప్పుడు విచారణ జరుపుతారో శనివారం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఆ రోజు దీనిపై విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అప్పటివరకూ స్టేటస్ కో మెయింటైన్ చేయాలన్న కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, వాదనలు విన్న తర్వాతే ఎలాంటి ఆదేశాలైనా జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.
అప్పట్లో నోటీసులు
ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతిపై సీబీఐ కేసు, మనీ లాండరింగ్ పై ఈడీ కేసులు నమోదయ్యాయి. సీబీఐ గతంలో కవిత ఇంటికి వచ్చి స్టేట్ మెంట్ రికార్డు చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ కవితకు సమన్లు జారీ చేయగా.. తాను బిజీగా ఉన్నానని.. తన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ లో ఉందన్న కారణాలతో ఆమె హాజరు కాలేదు. 2022 జులై తర్వాత లిక్కర్ స్కాం వెలుగులోకి రాగా.. దాదాపు ఐదు నెలల తర్వాత అదే ఏడాది డిసెంబర్ లో తొలిసారి సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది. 2022, డిసెంబర్ 11న తొలిసారి సీబీఐ అధికారులు ఆమెను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో విచారించారు. సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షిగా సుమారు 7 గంటలకు పైగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తర్వాత సీఆర్పీసీ 91 కింద ఈ కేసుకు సంబంధించిన ఏవైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరుతూ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత సీబీఐ నోటీసులు ఇచ్చినా కవిత హాజరు కాలేదు. కోర్టులో ఉన్న తన పిటిషన్‌ను కారణంగా చూపించారు.
'మరింత సమాచారం కోసం..'
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని.. ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవిత తీహార్ జైలులో ఉండగా.. అక్కడే విచారిస్తామని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కొందరు కవిత పేరు ప్రస్తావించారని.. ఈ నేపథ్యంలో కవిత వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు కవితను విచారించేందుకు సీబీఐకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమెను విచారించేందుకు ఒక రోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకు కోర్టు స్పష్టం చేసింది.
Also Read: Errabelli Dayakar Rao : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు - ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు