Delhi Liquor case : మరోసారి ఎమ్మెల్సీ కవితకు షాక్, జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు
Excise policy case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. మరో రెండు వారాలు జ్యుడిషియల్ రిమాండ్ పొడగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Delhi Liquor case : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. రాస్ అవెన్యూ కోర్టులో ఆమె జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. ఆగస్టు 9 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు కూడా కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడగించింది. తదుపరి విచారణ ఆగస్టు 9కి వాయిదా వేసింది. గడువు ముగియడంతో ఈ ముగ్గురిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టుకు హాజరుపరిచారు. మరోవైపు ఈడీ కేసు ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చింది. ఈడీ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 13 వరకు పొడిగించింది. కోర్టు నిర్ణయంపై బీఆర్ఎస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 16న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో నేటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. దీంతో అధికారులు వర్చువల్‌గా ఆమెను కోర్టులో హాజరు పర్చారు. కేసు విచారణ కీలక దశలో ఉందని... ఈ సమయంలో కవిత కస్టడీని పొడగించాలని ఈడీ తరుఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు మరో రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఇది ఇలా ఉంటే.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తును సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. సోమవారం కేజ్రీవాల్‌తో పాటు ఇతరులపై తన తుది ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తదితరులపైనా సీబీఐ గతంలో ప్రధాన చార్జిషీట్, నాలుగు అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసింది. సోమవారం దాఖలు చేసిన ఛార్జిషీట్ ఈ కేసులో చివరి ఛార్జిషీట్ అని ఏజెన్సీ తెలిపింది. 2021 మార్చి 16న ఢిల్లీ సెక్రటేరియట్‌లోని కేజ్రీవాల్‌ని ఆయన ఆఫీసులో టీడీపీ ఎంపీ, మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసలు రెడ్డి కలిశారని, ఢిల్లీలో మద్యం వ్యాపారంలో తనవంతు సహకారం అందించాల్సిందిగా అభ్యర్థించారని కవితపై ఛార్జిషీట్‌లో ఏజెన్సీ పేర్కొంది. ఆ సమయంలో చేసిన ఎక్సైజ్ పాలసీ 2021-22లో మార్పులు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై తన బృందంతో కలిసి పనిచేస్తున్నందున కవితను సంప్రదించాల్సిందిగా కేజ్రీవాల్.. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కోరినట్లు సీబీఐ ఆరోపించింది.
ప్రతిగా, కేజ్రీవాల్ తన రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి నిధులు ఇవ్వాలని శ్రీనివాసులు రెడ్డిని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. 2021-22 ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసేందుకు విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, దినేష్ అరోరా ద్వారా దక్షిణ భారతదేశంలో మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న కొందరు సుమారు రూ.90-100 కోట్ల లంచం తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నాయకులు.. ఇతర ప్రభుత్వోద్యోగులకు ఇది ముందుగానే ముట్టజెప్పారు. నిబంధనలను ఉల్లంఘించి, పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా, మద్యం తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు అనే ముగ్గురు వాటాదారుల మధ్య ఒక కార్టెల్ ఏర్పడిందని సీబీఐ ఆరోపించింది. అక్రమ లక్ష్యాలను సాధించడంలో కుట్రదారులందరూ క్రియాశీల పాత్ర పోషించారని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ ఉద్యోగులు, కుట్రలో పాలుపంచుకున్న ఇతర నిందితులకు అనవసరమైన మేరకు లాభం చేకూరిందని సీబీఐ ఆరోపించింది.