HarishRao: 'పొద్దు తిరుగుడు పంటను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి' - సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ
Telangana News: రాష్ట్రంలో పొద్దు తిరుగుడు పంట కొనుగోళ్లకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
Harish Rao Letter To Cm Revanth Reddy: రాష్ట్రంలో పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి.. పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి (Cm Revanth Reddy) సోమవారం లేఖ రాశారు. రైతులు పండించిన చివరి గింజ వరకూ కనీసం మద్దతు ధర రూ.6,750 చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన నిధుల మేరకే కొనుగోలు చేసి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాల్సిన వాటాపై మౌనంగా ఉంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇది రైతులను అవమానించడమే అవుతందని చెప్పారు.
శ్రీయుత ఎనుముల రేవంత్ రెడ్డి గారు,
— Harish Rao Thanneeru (@BRSHarish) April 8, 2024
ముఖ్యమంత్రి,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
హైదరాబాద్.
విషయము: పొద్దు తిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం గురించి.
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు…
లేఖలో ఏం చెప్పారంటే.?
'ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దు తిరుగుడు పంటను పండించారు. కనీస మద్దతు ధరపై ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాశాను. దీనిపై స్పందించిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పువ్వు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీని ప్రకారమే మార్కెట్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే, రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయకుండా.. కేవలం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారు. మిగతా పంటను ప్రస్తుతం కొనుగోలు చేయలేదు. దీంతో 75 శాతం పంటను రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన నష్టపోతున్నారు. రాష్ట్రంలో 1,65,800 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంట దిగుబడి వస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం తన నిధులతో కేవలం 37,300 క్వింటాళ్లు మాత్రమే కొనడానికి అంగీకరించింది. మొత్తం పంటలో కేవలం 25 శాతమే కేంద్రం కొనుగోలు చేస్తుంది. మిగతా 75 శాతం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. బీఆర్ఎస్ హయాంలో రైతులు పండించిన చివరి గింజ వరకూ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు తెరచి, పంటకు మద్దతు ధర ఇచ్చిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఈసారి కూడా రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధరతో పొద్దు తిరుగుడు కొనుగోలు చేయాలి.' అంటూ హరీష్ రావు లేఖలో ప్రస్తావించారు.
13 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర
మరోవైపు, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) బస్సు యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13 నుంచి ఆయన ప్రజల్లోకి రానున్నారు. ఆ రోజు చేవెళ్ల (Chevella) బహిరంగ సభలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బహిరంగ సభల కంటే బస్సు యాత్రల వైపే గులాబీ బాస్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొననున్నట్లు సమాచారం. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచే బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Also Read: KCR: ఈ నెల 13 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర - పార్లమెంట్ ఎన్నికల వేళ జనంలోకి గులాబీ బాస్