Telangana Politis : ఫార్టీ ఫిరాయిస్తున్న వారిపై న్యాయపోరాటం - అనర్హత వేటుకు ప్రయత్నం - సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్
BRS News : పార్టీ మారుతున్న వారిపై అనర్హతా వేటు వేయించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.
BRS To Supreme Court : పార్టీ మారుపోతున్న ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఆపలేకపోతోంది. బుజ్జగింపుల ద్వారా సాధ్యం కావడం లేదు కాబట్టి .. వారిలో అనర్హతా వేటు భయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ మారిన వారందరిపై అనర్హతా వేటు వేయించేందుకు సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు వెనుకాడేది లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీని వీడిపోతున్న అత్యంత నమ్మకస్తులు
తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు అత్యంత సన్నిహితులైన వారు పార్టీ వీడిపోతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివసారెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం బీఆర్ఎస్ అగ్రనేతలకు ఊహించని షాక్ లాంటిది. వారిని అత్యంత నమ్మకస్తులుగా కేసీఆర్ భావిస్తారు. జగిత్యాల సంజయ్ కుమార్ గెలుపును కల్వకుంట్ల కవిత రెండు సార్లు తన సొంత గెలుపుగా భావించి పని చేశారు. ఆయన కూడా పార్టీ మారిపోవడంతో ఇక రాజకీయాల్లో విశ్వసనీయతకు అర్థం లేదని అనుకుంటున్నారు. అంతకు ముందే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వంటి వారు కాంగ్రెస్ లో చేరిపోయారు. వారందిరపై అనర్హతా వేటు వేయించేందుకు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు.
అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనంటున్న బీఆర్ఎస్
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ వాదిస్తోంది. దానం నాగేందర్ పార్టీ మారినప్పుడు ఆయనపై స్పీకర్ కార్యాలయంలో పార్టీ ఫిరాయింపు పిర్యాదు ఇచ్చారు. తర్వాత హైకోర్టులోనూ పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ జరగాల్సి ఉంది. మరో వైపు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వరుసగా పార్టీ మారిపోతున్నారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తులైన వారిపై వచ్చే ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటాయి కాబట్టి.. మూడో కంటికి తెలియకుండా కండువా కప్పేస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు అందర్నీ ఢిల్లీకి పిలిపించి కండవాలు కప్పుతారని.. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేస్తారని అంటున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా అనర్హతా వేటు అస్త్రాన్ని బీఆర్ఎస్ ప్రయోగిస్తోంది.
అనర్హతపై స్పీకర్‌దే తుది నిర్ణయం
అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ దే తుది నిర్ణయం. స్పీకర్ ఫలానా నిర్ణయం తీసుకోవాలని.. లేదా ఫలానా తేదీలోపు నిర్ణయం తీసుకోలేవని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్ర విషయంలో అక్కడ పార్టీల్లో చీలిక వచ్చిందని ఈ కారణంగా ఏ పార్టీ వారు ఏ పార్టీలో చేరారన్నది స్పీకర్ తేల్చలేకపోవడం వల్ల మూడు నెలల గడువు పెట్టారని అంటున్నారు. మామూలుగా అయితే అధికార పార్టీల్లో చేరే ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి స్పీకర్లు నిర్ణయాలు తీసకోవడం లేదు. అధికార పార్టీ వ్యూహంలోనే భాగంగానే వారు పార్టీలో చేరుతున్నారు. అయితే న్యాయపోరాటం చేసి అయినా సరే వాళ్లను మాజీలను చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.