KCR Phone Call: 'ఫాం హౌస్ కు అవన్నీ పంపండి' - ఎరువుల షాప్ యజమానికి కేసీఆర్ ఫోన్ కాల్
KCR: గాయం అనంతరం కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయంపై దృష్టి సారించారు. ఓ ఎరువుల షాప్ యజమానికి ఫోన్ చేసి అసరమైన ఎరువులు, విత్తనాలు పంపాలని సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
KCR Phone Call To Fertilizer Shop Owner: తుంటి మార్పిడి సర్జరీ అనంతరం కోలుకుంటున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వ్యవసాయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో 10 రోజుల్లో ఎర్రవల్లిలోని (Erravalli) ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం వంటిమామిడిలోని ఎరువుల షాప్ యజమానికి ఫోన్ చేశారు. అవసరమైన ఎరువులు, విత్తనాలు పంపించాలని సూచించారు. అయితే, నిజంగా కేసీఆరే తనకు ఫోన్ చేశారా.? అనే అనుమానం షాపు యజమానికి కలిగింది. తర్వాత తేరుకుని కేసీఆర్ మాటలు వినపడడంతో షాక్ అయ్యాడు. సార్ చెప్పండి అనగానే.. 'ఎర్రవల్లి ఫాం హౌస్ కు విత్తనాలు, ఎరువులు పంపండి. 10 రోజుల్లో ఫామ్ హౌస్ కు వస్తాను. వ్యవసాయం చూసుకుంటాను.' అని చెప్పారు. అనంతరం సదరు ఎరువుల యజమాని కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేయగా ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు పంపాలని వంటిమామిడి ఎరువుల వ్యాపారితో ఫోన్లో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. pic.twitter.com/fzavJbxtNw
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2024
రీఎంట్రీ అప్పుడేనా.?
మరోవైపు, కేసీఆర్ తన పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజే హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు రానున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మ స్థైర్యం నింపేలా జనంలోకి ఆ రోజు రావాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు, నేతలు, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. గజ్వేల్ లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్.. వచ్చే నెల 20 తర్వాత నియోజకవర్గ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఇకపై రెగ్యులర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కేడర్ కు అందుబాటులో ఉండాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి పర్యటనలో నియోజకవర్గ ప్రజలకు.. తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలపడం సహా స్థానికంగా అభివృద్ధి పనులపైనా అధికారులతో చర్చించనున్నారని సమాచారం. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. క్షేత్ర స్థాయిలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. జంట నగరాల్లో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు కట్టేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తొలిసారిగా జనంలోకి వస్తారని భావిస్తోన్న తరుణంలో ఆ మేరకు ఘన స్వాగతం పలికేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
తెలంగాణ భవన్ లోనే
ఇక తెలంగాణ భవన్ వేదికగానే పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక్కడే లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, పార్టీ కార్యాలయంలోనే నాయకులు, కేడర్ తో వరుస భేటీలో నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాలపై ప్రణాళికలు రచించనున్నట్లు సమాచారం. ఈ నెల 22న పార్టీ లోక్ సభ సన్నాహక సమావేశాలు ముగియనుండగా.. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ ఇలానే మీటింగ్స్ జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల టైంలోనే వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అనేకమార్లు తేదీలు ప్రకటించినా.. అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపే అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.