MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ర్యాలీకి బాంబే హైకోర్టు అనుమతి, ముంబయిలో భారీ ర్యాలీ
Raja Singh News: ఫిబ్రవరి 25 సాయంత్రం 5 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రాజా సింగ్ శోభా యాత్ర తలపెట్టారు.

MLA Rajasingh Rally in Mumbai: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ర్యాలీకి బాంబే హైకోర్టు అనుమతించింది. ముంబైకి సమీపంలో మీరా రోడ్‌లో ఆయన ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకొనేందుకు ధర్మాసనం అంగీకరించింది. ఫిబ్రవరి 25 సాయంత్రం 5 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రాజా సింగ్ శోభా యాత్ర తలపెట్టారు. అయితే, కట్టుదిట్టమైన షరతులతో ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ ఎమ్మెల్యేకు హైకోర్టు అనుమతించింది. రాజా సింగ్ ర్యాలీ, శోభా యాత్ర వీడియోలను రికార్డ్ చేయాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.
రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదంటూ రాజాసింగ్‌కు హైకోర్టు షరతు విధించింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు జనవరి 21వ తేదీ రాత్రి మీరారోడ్డులోని నయానగర్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ శోభా యాత్ర కూడా మీరా రోడ్‌లోని నయానగర్‌లో తలపెట్టిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. కొద్ది రోజుల క్రితం ఎంఐఎం నేత వరీష్ పఠాన్ నయా నగర్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
ముంబైలోని దహిసర్ బోర్డర్‌లో అదుపులోకి తీసుకుని నయా నగర్‌కు రావద్దంటూ నోటీసులు ఇచ్చారు. అలాగే రాజా సింగ్ ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో హిందూ సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు నుంచి అనుమతి పొందిన తరువాత రాజా సింగ్ ర్యాలీ, శోభాయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.





















