Telangana: 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, 60 పోస్టులతో తొలి నోటిఫికేషనా? మాజీ ఎంపీ వినోద్ కుమార్ సెటైర్లు
Vinod Kumar Boianapalli: 2 లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కేవలం 60 గ్రూప్ 1 పోస్టులతో తొలి నోటిఫికేషన్ వేశారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: అధికారంలోకి రాగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని, సాధ్యమైనంత త్వరగా ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కేవలం 60 గ్రూప్ 1 పోస్టులతో తొలి నోటిఫికేషన్ వేశారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Vinod Kumar Boianapalli) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తవుతున్నా, ఉద్యోగాల ప్రకటన ఊసే లేకపోవడం బాధాకరం అన్నారు. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం ఈనెలాఖరు వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో (ఒక లక్ష 99940 )ఉద్యోగ ఖాళీలను గుర్తించి ప్రభుత్వం (Telangana Government) షెడ్యూల్ విడుదల చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని.. కనుక నిరుద్యోగులకు సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. ఉద్యోగ ఖాళీల వివరాలు స్పష్టం చేయడంతో పాటు వెంటనే నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి విద్యార్థులకు, ఉద్యోగార్థులకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేస్తుందని చెప్పినట్లుగా, నోటిఫికేషన్లు ప్రకటనలు రావాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారని.. కానీ రెండు నెలలు పూర్తవుతున్నా కేవలం 60 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ రావడం విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తుందన్నారు. కనుక నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారో, జాబ్స్ రిక్రూట్‌మెంట్‌పై నిరుద్యోగులకు స్పష్టతనివ్వాలని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో 1,60,083 (ఒక లక్షా 60 వేల 83) ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని వినోద్ కుమార్ తెలిపారు. వాటితో పాటు మరో 42 వేల ఉద్యోగాలకు పరీక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించగా.. కోర్టు కేసుల కారణంగా నియామకాలు జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా ఏడాదిలో 2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కనుక నిరుద్యోగులు, యువతకు న్యాయం చేయాలంటే కచ్చితంగా 2024 డిసెంబర్ 31 నాటికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.