Telangana Elections: ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌కు షాక్, బీఆర్ఎస్‌లోకి కీలక నేత వన్నెల అశోక్!
Telangana Elections: ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక నేత ఒకరు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు.
Telangana Elections: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. ఒక పార్టీ నుంచి మరోక పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నారు. అసంతృప్త నేతలు పార్టీని వీడి మరో పార్టీలోకి గోడ దూకేస్తున్నారు. అలాగే ఒక పార్టీలో సీటు దక్కని నేతలు వేరే పార్టీలో చేరుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. బీజేపీలోకి పెద్దగా నేతలెవ్వరూ చేరడం లేదు. బీజేపీ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. అలాగే కాంగ్రెస్‌లో సీటు దక్కని నేతలు బీఆర్ఎస్ లేదా బీజేపీలో చేరుతున్నారు.
ఈ క్రమంలో పోలింగ్‌కు మరో 15 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. బోథ్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కీలక నేత వన్నెల అశోక్ హస్తం పార్టీని వీడనున్నారు. ఆయన గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో రేపో, మాపో ఆయన కాంగ్రెస్‌న వీడి కారెక్కడం ఖాయంగా తెలుస్తోంది. బోథ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌ను ఆయన ఆశించారు. తొలుత వన్నెల అశోక్‌కే టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆయన నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టారు.
అయితే చివరికి వన్నెల అశోక్‌కు కాంగ్రెస్ బీఫారం ఇవ్వలేదు. ఆయనకు కాకుండా బోథ్ నుంచి ఆడె గజేందర్‌కు కాంగ్రెస్ బీఫారం ఇచ్చింది. దీంతో కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తితో వన్నెల అశోక్ ఉన్నారు. ఈ తరుణంలో భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో గత కొద్దిరోజులుగా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే గులాబీ నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం కూడా వన్నెల అశోక్‌ను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపో, మాపో ఆయన గులాబీ గూటికి చేరనున్నారని సమాచారం. అయితే రెండో జాబితాలో బోథ్ నుంచి వన్నెల అశోక్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. కానీ చివరి నిమిషంలో ఆడె గజేందర్‌కు బీఫారం ఇచ్చింది. ఎన్నికల పోలింగ్‌కు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉంది. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. కీలక సమయంలో కీలక నేత పార్టీ మారుతుండటం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది.
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేటితో నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు ముగిసింది. దీంతో ఇక పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. దీంతో మొత్తం 119 నియోజకవర్గాల్లో 2 వేలకుపైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగుతున్నారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కూడా గట్టిగానే పోటీ ఇస్తోంది. కానీ మెాజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఈ పోటీలో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనేది కీలకంగా మారింది. కొన్ని సర్వేలు బీఆర్ఎస్‌కు పట్టం కడుతుండగా.. మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి.