Election Results Reactions : యూపీలో జరిగిందే తెలంగాణలో జరుగుతుంది - బీజేపీ నేతల ధీమా
యూపీలో గెలిచినట్లే తెలంగాణలో గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. యూపీ నుంచి బుల్డోజర్లు వస్తున్నాయని రాజాసింగ్ ప్రకటించేశారు.
ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ఆ పార్టీ తెలంగాణ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలోనే తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వివిధ చోట్ల మీడియాతో మాట్లాడిన తెలంగాణ నేతలు.. నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాల తరహాలోనే తెలంగాణలోనూ విజయం సాధిస్తామన్నారు.
టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే : బండి సంజయ్
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ముందుగానే ఊహించామని బండి సంజయ్ ప్రకటించారు. కొన్ని సర్వే సంస్థలు, మీడియా ప్రతినిధులు యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ పనైపోతుందని ప్రచారం చేశారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కావాలని అక్కడి ప్రజలు ఆశించారని పేర్కొన్నారు. తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టిందని బండి సంజయ్ అన్నారు. అందుకే రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ బద్నాం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ (CM KCR) చేస్తున్న పర్యటనలు కేవలం విహార యాత్రలుగా మిగిలిపోయాయని.. సీఎం పర్యటనలతో ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారు.
మత పిచ్చి పార్టీ అనే వాళ్లు గోవా ఫలితాల్ని చూడాలి : కిషన్ రెడ్డి
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున బాధ్యతల్ని కిషన్ రెడ్డి తీసుకున్నారు. తమది మత పిచ్చి పార్టీ అని ప్రచారం చేసేవాళ్లు గోవాలో తమ హ్యాట్రిక్ విజయాన్ని చూడాలని అన్నారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న గోవాలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోనూ బీజేపీ అద్భుతమైన రీతిలో ఫలితాలు సాధించిందని, యూపీలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరుసగా రెండుసార్లు ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అరుదైన విషయమని, అలాంటిది యూపీలోనూ, ఉత్తరాఖండ్ లోనూ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఉత్తరాఖండ్ లో కొన్ని కారణాల రీత్యా ముఖ్యమంత్రులు మారినప్పటికీ ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని కిషన్ రెడ్డి వివరించారు. మణిపూర్ లోనూ తమదే హవా అని స్పష్టం చేశారు.
యూపీ నుంచి తెలంగాణకు బుల్డోజర్లు : రాజాసింగ్
యోగి నాయకత్వాన్ని యూపీ ప్రజలు బలపరిచారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇక నెక్స్ట్ తెలంగాణనే బీజేపీ టార్గెట్ అని, ఎప్పడు ఎన్నికలు జరిగినా గెలిచేది తమ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో రౌడీయిజం, గూంఢాయిజం, మాఫియాకు యోగి సర్కారు ముగింపు పలికిందన్నారు. వారందరిపై యోగి బుల్డోజర్లు నడిపించారని అన్నారు. అలాగే తెలంగాణలో కూడా తాము ఇసుక మాఫియా, భూముల మాఫియా, టీఆర్ఎస్ గూంఢాయిజంపై వంద శాతం బుల్డోజర్లు నడిపిస్తామని వ్యాఖ్యానించారు. యూపీ బుల్డోజర్లు తెలంగాణకు వస్తున్నాయని, తెలంగాణలో కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను బుల్డోజర్లతో తొక్కించేస్తామని అన్నారు. ఇక ఎంఐఎం పార్టీ డబ్బుల కోసమే దేశమంతా పోటీ చేస్తోందని ఆరోపించారు.