Hyderabad Second Capital : దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ - అన్ని పార్టీలూ ఆలోచించాలన్న తెలంగాణ బీజేపీ నేత !
దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌పై చర్చ జరగాలని బీజేపీ నేత విద్యాసాగర్ రావు కోరారు. గతంలో కేసీఆర్ సమక్షంలోనే ప్రకాష్ అంబేద్కర్ ఈ మాట అన్నారు.
Hyderabad Second Capital : బీజేపీ సీనియర్ నేత మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు భారత్ కు రెండవ రాజధానిగా హైదరాబాద్ అయ్యే అవకాశం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో ఈ అంశం ఉందని తెలిపారు. గతంలో కూడా విద్యాసాగర్ రావు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఢిల్లీలో నెలకొన్న కాలుష్యపరిస్థితులను చూస్తుంటే డా. బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని అని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ గా చేసిన తర్వాత విద్యాసాగర్ రావు కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపే అవకాశాలు ఉన్నాయి.
సీఎం కేసీఆర్ సమక్షంలోనే హైదరాబాద్ రెండో రాజధాని అంశాన్ని ప్రస్తావించిన ప్రకాష్ అంబేద్కర్
ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రకాష్ అంబేద్కర్ కూడా .. తెలంగాణ ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ కన్న కలలను నిజం చేయాలని అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రెండో రాజధాని కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోణంలో హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలని అంబేడ్కర్ బలంగా కోరేవారన్నారు. కేసీఆర్ సమక్షంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రాటజీలో భాగం అవుతాయా అన్న చర్చ అప్పుడే ప్రారంభమయింది. ఇప్పుడు బీజేపీ కీలక నేత ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
తరచూ చర్చల్లోకి వస్తున్న రెండో రాజధాని !
దక్షిణాదిన రెండో రాజధాని ఉండాలన్న ప్రస్తావన చాలా రోజులుగా వస్తున్నదే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వాతంత్రోద్యమ కాలంలోనే ఈ మాట చెప్పారన్న ప్రచారం ఉంది. హైదరాబాద్ ను సెకెండ్ కేపిటల్ చేయాలంటూ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకం 11వ అధ్యాయంలో అంబేడ్కర్ రాశారు. ఈ పుస్తకం 1955లో ప్రచురితమైనప్పుడు జనం అంబేడ్కర్ వాదనతో ఏకీభవించారు అయితే అది కార్యరూపానికి నోచుకోలేదు. తర్వాత మరుగున పడిపోయింది. ఇటీవలి కాలంలో మారిపోతున్న రాజకీయ ప్రాధాన్యలతో ఉత్తర దక్షిణ తారతమ్యాలను పోగొట్టేందుకు సెకెండ్ కేపిటల్ ఒకటి కావాలన్న అభిప్రాయం చాలా రోజులుగా ఉంది. ప్రకాష్ అంబేద్కర్ వ్యాఖ్యలతో మరింత విస్తృతంగా చర్చ ప్రారంభమయింది.
రక్షణ పరంగా హైదరాబాద్ సేఫ్ !
దక్షిణాదిన సౌతిండియాలో ఒక కేపిటల్ ఏర్పాటు చేయాలన ప్రస్తావన వచ్చినప్పుడు రెండు మూడు నగరాల పేర్లు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్ తో పాటు బెంగళూరు చెన్నై మహానగరాల పేర్లు కూడా వినిపించాయి. అయితే వాతావరణ సమతౌల్యత విషయంలో అందరూ హైదరాబాద్ కే మొగ్గు కనిపించింది. ల్యాండ్ లాక్డ్ ప్రదేశమైన హైదరాబాద్ కు సెక్యూరిటీ రిస్క్ లేదు. ఏ నగరంతో పోల్చుకున్నా భద్రతలో హైదరాబాద్ కు సాటి లేదు. ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పినట్లుగా ఢిల్లీ మన దేశ సరిహద్దుకు కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాకిస్తాన్ దండయాత్రకు చాలా దగ్గరగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. హస్తినాపురి నగరం రోజురోజుకు కాలుష్య కాసారంగా మారిపోతోంది. చలికాలం వచ్చిందంటే చాలు పొల్యుషన్ తో జనం రోగాల బారిన పడుతున్నారు. కాలుష్యం ప్రజలినప్పుడల్లా కేపిటల్ మార్పుపై చర్చ జరుగుతోంది.
విద్యాసాగర్ రావు, ప్రకాష్ అంబేద్కర్ చెప్పినట్లుగా.. హైదరాబాద్ దేశ రెండో రాజధానిపై చర్చ ప్రారంభమయినట్లే. ఇది ఏ దిసగా ముందుకు వెళ్తుందనేది వేచి చూడాల్సి ఉంది.