Bhadrachalam Godavari Floods : భద్రాచలం వద్ద ఉగ్రగోదావరి, వంతెనపై రాకపోకలు బంద్
Bhadrachalam Godavari Floods : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే 61 అడుగులకు చేరిన వరద రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది.
Bhadrachalam Godavari Floods : తెలంగాణలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రవాహం మరింత పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో భద్రాచలంలోని పలు కాలనీలు నీట మునిగాయి. సుభాష్‌నగర్, రామాలయం పరిసరాలు, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలను వరద చుట్టుముట్టింది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు కాలనీలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
మూడో ప్రమాద హెచ్చరిక
గురువారం రాత్రికి భద్రాచలంలో గోదావరి వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 61 అడుగులకు చేరింది. ఈరోజు రాత్రికి నీటి మట్టం 66 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం నుంచి కూనవరం, చర్ల మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం 5 గంటల నుంచి భద్రాచలం గోదావరి వంతెనపై కూడా రాకపోకలను నిలిపేయాలని అధికారులు నిర్ణయించారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నదిలో ప్రస్తుతం 18.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో ప్రజలు బయటకు రాకుండా 144 సెక్షన్ విధించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఉద్ధృతంగా పేన్ గంగా
ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై గల పేన్ గంగానదితో పాటు జైనథ్ మండలంలోని చనకా కొరటా బ్యారేజీని ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించారు. పేన్ గంగానదికి ఎగువన కురుస్తున్న వర్షాలతో గంటగంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, మరో మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు మరింత అలర్ట్ గా ఉండాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని చనాకా - కోరటా బ్యారేజీను ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు. బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంప్ హౌస్ వద్ద పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
కరీంనగర్ జిల్లాలో
రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లాలో ప్రభావితమైన ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉన్నామన్నారు. రోడ్లపై ప్రమాదకర పరిస్థితులు, నీటి నిలువ లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మానేరు ముంపు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గురువారం ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి తిరుగుతూ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని వల్లంపాడు నుంచి తీగలగుట్టపల్లి వరకూ స్వయంగా కాలినడకన తిరుగుతూ ప్రజల మంచి చెడుల్ని తెలుసుకున్నారు. ఇరుకుల వాగు ఉద్ధృతి పెరుగుతుండడంతో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది వలస కార్మికులను కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. అంటువ్యాదులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని ముసురుకు తోడు, వరదతో నీళ్లు నిండిన ప్రాంతాల్లో సంచార వైద్య బృందాలు పర్యటిస్తున్నాయని తెలిపారు.