Razakar Movie : రజాకార్ మూవీకి పన్ను మినహాయింపు ఇవ్వండి - రేవంత్ కు బండి సంజయ్ లేఖ
Telangana : రజాకార్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. సినిమా ప్రదర్శనకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.
Tax exemption for Razakar movie : 'రజాకార్' మూవీకి వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వడంతో పాటు స్కూల్, కాలేజీ విద్యార్థులకు చూపించాలని బండి సంజయ్..సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రజాకార్ల రాక్షస పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను కళ్లకు కట్టినట్లు చూపిన చిత్రం 'రజాకార్' అని అన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి స్వేచ్ఛా వాయువును అందించేందుకు జరిగిన పోరాటాలు, రజాకార్ల రాక్షసత్వంపై పోరాడి ప్రాణాలు విడిచిన యోధుల చరిత్ర, తెలంగాణ ప్రజలకు విమోచన కల్పించేందుకు ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని ఈ మూవీలో అద్భుతంగా చూపించారని బండి సంజయ్ కితాబునిచ్చారు. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన సినిమా దర్శక, నిర్మాతలకు, చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు.
ఇలాంటి మంచి మూవీని తీసిన వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బండి సంజయ్ గుర్తు చేశారు. తద్వారా ప్రజల్లోకి మంచి సందేశం పంపినట్లవుతుందని చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఎన్నో ఆటుపోట్లను, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని నిర్మించిన రజాకార్ సినిమాకు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. థియేటర్లలో ప్రత్యేక షోలు వేసి, పాఠశాల, కళాశాల విద్యార్థులకు చూపించాలని కోరడం జరిగింది. దాంతో నాటి మహనీయులను స్మరించుకోవడంతో పాటు వారి పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచే అవకాశం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇంతటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న 'రజాకార్' సినిమాను థియేటర్లలో ప్రదర్శించే అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ఇలాంటి సందేశాత్మక చిత్రాలను వీలైనంత ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఈ సినిమా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు అందరూ ఈ చిత్రాన్ని చూసి ఒవైసీ పార్టీ ఎలాంటిదో తెలుసుకోవాలని హితవు పలికారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే తమ అభిమతం అని ప్రకటించారు.
ఎంత ఖర్చైనా ధైర్యంగా చిత్రాన్ని నిర్మించిన గూడూరు నారాయణ రెడ్డికి బండి సంజయ్ అభినందించారు. కాగా, యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటి అనసూయ కీలక పాత్రలో నటించింది.ఈ సినిమా మార్చి పదిహేనో తేదీన విడుదల అయినప్పటికీ.. పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవడంతో.. అతి తక్కువ కలెక్షన్లతో నడుస్తోంది.