
KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !
దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు భారీగా పెట్టుబడులు ఆకర్షించారు కేటీఆర్. దాదాపుగా రూ. 4200 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.

KTR Davos Tour : తెలంగాణ మంత్రి కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు పర్యటన విజయవంతంగా ముగిసింది. మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా సుమారు 4200 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. ఈ మేరకు పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు తో పాటు పెట్టుబడి ప్రకటనలను ప్రకటించాయి. ఈ సారి భారతదేశం నుంచి దావోస్ లో పాల్గొన్న పలు రాష్ట్రాల పెవిలియన్ లతో పోల్చినపుడు తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత దేశానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులతో పాటు పలు అంతర్జాతీయ మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ పెవిలియన్ ను ప్రశంసించారు.
ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్
తెలంగాణ పెవీలియన్ మంత్రి కేటీఆర్ సమావేశాలతో పాటు పలు చర్చ గోష్ఠిలకి వేదికగా మారింది. ముఖ్యంగా మంత్రి కే. తారకరామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్, సిఐఐ పెవిలియన్ లలో జరిగిన చర్చలు, తెలంగాణ పెవిలియన్ లో జరిగిన ఫార్మా లైఫ్ సైన్స్, దేశంలోని ప్రముఖ యూనికార్న్ వ్యవస్థాపకులలో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఆయా చర్చల్లో మంత్రి కేటీఆర్ తన ప్రసంగాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలకు ప్రశంసలు లభించాయి. మొత్తం 45 కంపెనీల ప్రతినిధి బృందాలతో సమావేశమయ్యారు.
తెలంగాణను ప్రమోట్ చేసుకునే గొప్ప అవకాశం లభించిందన్న కేటీఆర్
ప్రపంచ వేదిక పైన తెలంగాణ ప్రభుత్వ విధానాలతో పాటు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ ఆఫీసును విస్తరించాలని జెడ్ఎఫ్ సంస్థ నిర్ణయం !
తిరుగు ప్రయాణంలో కూడా కేటీఆర్ పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో ZF కంపెనీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ZF కంపెనీ తెలంగాణలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపింది. సుమారు మూడు వేల మంది ఉద్యోగులతో తన హైదరాబాద్ కార్యాలయం తన అతిపెద్ద కార్యాలయంగా మారుతుందని ప్రకటించింది. తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని, అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రారంభించబోతున్న నూతన క్యాంపస్ తో తన అతిపెద్ద కార్యాలయంగా హైదరాబాద్ నగరం ఉండబోతుందని తెలిపింది. ఈ మేరకు జూన్ 1వ తేదీన తన కార్యాలయాన్ని నానక్రామ్గూడలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ కి తెలిపింది. ZF కంపెనీ విస్తరణతో తెలంగాణలో మొబిలిటీ రంగానికి అదనపు బలం చేకూరుతోందని కేటీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో ZF కంపెనీ విస్తరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

