Telangana AP Live News: కార్వీ సంస్థ ఎండీ అరెస్టు.. పార్థసారథిపై భారీ అభియోగాలు!
విజయవాడలో కారులో డెడ్‌బాడీ కలకలం రేపింది. మొగల్రాజపురం మానర్ ప్లాజా ఎదురుగా ఉన్న రోడ్డులో పార్క్ చేసిన ఫోర్డ్ కారులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
LIVE
Background
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి సహా ఇతర అధికారులు కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా తగ్గుముఖం పట్టాలని స్వామివారిని ప్రార్థించినట్టు కిషన్ రెడ్డి చెప్పారు.
మొహర్రం: రేపు హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు
మొహర్రం సందర్భంగా రేపు (ఆగస్టు 20) ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. రేపు హైదరాబాద్‌లోని డబీర్‌పురాలోని బీబీ కా ఆలం నుంచి చాదర్‌ఘాట్ వరకు ఊరేగింపు జరగనుంది. హైదరాబాద్‌లో మొహర్రం సన్నాహాలపై పోలీసులతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వర్చువల్ విధానంలో మాట్లాడారు. రేపు హైదరాబాద్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలు కరోనా నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
వీడిన గాంధీ ఆస్పత్రి మిస్టరీ.. ఆ మహిళ ఆచూకీ లభ్యం
గాంధీ ఆస్పత్రిలో మిస్సింగ్ అయి మూడు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న మహిళ ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించారు. నారాయణగూడలోనే ఆ మహిళ సురక్షితంగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల పాటు ఆమె ఓ వ్యక్తితో ఉన్నట్లుగా తేల్చారు. ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Karvy ఎండీ పార్థసారథి అరెస్టు
కార్వీ సంస్థ ఎండీ పార్థసారథి అరెస్టయ్యారు. దాదాపు రూ.720 కోట్లను దుర్వినియోగం చేసినట్లుగా కార్వీ ఎండీ పార్థసారథిపై అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకొని సీసీఎస్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
విజయవాడలో పార్క్ చేసి ఉన్న కారులో మృతదేహం....
విజయవాడ నగరంలో కారులో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. మాచవరం పరిధిలో పార్క్ చేసిన కారులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని జడ్‌ఎక్స్‌ఎన్ సిలిండర్ల కంపెనీ యజమాని తాడిగడపకు చెందిన రాహుల్‌గా పోలీసులు నిర్థారించారు. జి. కొండూరు మండలం చెరువు మాధవరంలో రాహుల్ కంపెనీ ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గ్యాంగ్ రేప్ అంతా బూటకమే: పోలీసులు
హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసు నాటకమని పోలీసులు తేల్చేశారు. ముగ్గురు ఆటో డ్రైవర్లు తనను ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కేసు పెద్ద హై డ్రామా అని పోలీసులు ధ్రువీకరించారు. తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు చేయగానే రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో ఈ కేసులో కిడ్నాప్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకనట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రియుడికి వివాహం నిశ్చయం కావడంతో అతణ్ని ఈ కేసులో ఇరికించేందుకు యువతి ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చారు.