Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర శ్రీలంక, తమిళనాడు వైపుగా వస్తున్న అల్పపీడనం ప్రభావం మరింత ప్రభావవంతంగా మారనుంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడుకు నవంబర్ 11న వస్తుంది, దీని ప్రభావంతో అదే రోజు నుంచి ఏపీలో వర్షాలు కురవనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ నేడు, రేపు ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా మారిపోయింది. తెలంగాణలో ఎక్కడా వర్షాలు కురవడం లేదు. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు మాత్రం పడుతున్నాయి. వాతావరణశాఖ చెప్పినట్లుగానే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. దీని ప్రభావం మరో రెండు రోజుల తరువాత ఏపీలో కనిపిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీలంక తీరం వెంట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆపై వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా నమోదవుతుండగా.. రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంది. పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులపాటు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ లో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 34.8 డిగ్రీలు నమోదు కాగా, హకీంపేటలో అత్యల్పంగా 16 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నవంబర్ 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు, మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.
హైదరాబాద్ లో చలి తీవ్రత పెరుగుతోంది. ఆకాశం పాక్షికంగా మేఘాలతో కప్పేసి ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11, 12, 13 తేదీలల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మాత్రం తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడతాయి. ముఖ్య నగరాలైన వైజాగ్, విజయవాడలో అల్పపీడనం అంతగా ప్రభావం చూపకపోవచ్చు. నవంబర్ 12 నుంచి 15 తేదీల్లో ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గాలులు వీచడంతో చలి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి. నేడు ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వాతావరణం పొడిగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఈ ప్రాంతాల్లో నవంబర్ 11 నుంచి మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 14 నుంచి వర్షాలు 16 తేదీలలో క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. అత్యధిక వర్షాలు తిరుపతి, నెల్లూరు జిల్లాలలో ఉంటాయి.
నవంబర్ 12 నుంచి అల్పపీడనం ప్రభావం తిరుపతి, నెల్లూరు జిల్లాలతో పాటుగా కడప, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల మీదుగా ఉండనుంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో 13న వర్షాలు కురవనున్నాయి. ఆ సమయానికి అల్పపీడనంగా బలహీనపడి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతంలో ఉన్న తేమను లాగుతుంది. నవంబర్ 14 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షాలుంటాయి. నవంబర్ 12 నుంచి 16 తేదీలలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మాత్రం తేలికపాటి తుంపర్లు, కొద్ది సేపు వర్షాలు పడతాయి. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండవు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫామ్‌హౌస్‌లో జరిగిన సంఘటనపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలో సిట్ పని చేయనుంది. ఈ సిట్‌లో సైబర్ క్రైమ్స్ డీసీపీ కమలేశ్వర్, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, నారాయణ పేట ఎస్పీ వెంకటేశ్వర్లు, నల్గొండ ఎస్పీ రాజేశ్వరి ఉన్నారు.
పీడీ యాక్ట్ కేసులో రాజాసింగ్‌కు ఊరట
మతఘర్షణలు జరిగేలా కామెంట్స్ చేశారన్న కారణంతో రెండు కేసుల్లో అరెస్టైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఊరట లభించింది. ఆయనపై కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు.
గ్రానైట్ కంపెనీలపై ఈడీ గురి- తెలంగాణ వ్యాప్తంగా వరుస సోదాలు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, హైదర్‌గూడ జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఐటి, ఈడి సోదాలు నిర్వహిస్తోంది. నాలుగవ అంతస్తులో ఉన్న గ్రానైట్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారుల బృందం. సోమాజిగూడలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. సోమాజిగూడా లో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంతోపాటు పలు కార్యాలయాల్లో రైడ్స్ చేస్తున్నారు. గ్రానైట్ క్వారీ నిర్వహకులు ఫేమా నిబంధనలు ఉల్లంఘించారు అని ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేస్తున్నారు. 8 ఏజెన్సీలకు గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చింది. తక్కువ పరిమాణం చూపి ఎక్కువ గ్రానైట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.
Nizam Collage: మళ్లీ ఆందోళన బాట పట్టిన నిజాం కాలేజీ విద్యార్థులు
- మరోసారి ఆందోళనకు దిగిన నిజాం కాలేజ్ విద్యార్థులు
- నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు హాస్టల్ అలాట్మెంట్ సమస్య పైన మంత్రి కే తారక రామారావు స్పందించినా కూడా కాలేజీ ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని ఆవేదన
- పీజీ విద్యార్థులకు మాత్రమే హాస్టల్ సదుపాయం అంటూ చేతులెత్తేసిన ప్రిన్సిపాల్
- తమ కు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేసిన విద్యార్థులు
Tirupati News: తిరుపతిలో ఒకేసారి విద్యార్థులు మిస్సింగ్
తిరుపతిలోని అన్నమయ్య ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదువుతున్న ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు మిస్సింగ్ అయ్యారు. గుణశ్రీ, మెహతాజ్ , మౌనశ్రీ , అబ్దుల్ రెహ్మాన్ పదో తరగతి చదువుతుండగా , అతీఫ్ హుస్సేన్ 9వ తరగతి చదువుతున్నారు. ఇవాళ ఉదయం 8 గం.లకు నెలవారీ పరీక్షలు రాసి టిఫిన్ చేసేందుకు ఇంటికి వెళ్తూ దారి మధ్యలో నలుగురు కలిసి స్కూల్ నుంచి వెళ్లిపోయారు. గత రెండు రోజుల నుంచి తిరుపతి నుంచి బయటకు వెళ్లిపోయేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి విషయాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది..