Breaking News Live Telugu Updates: అమలాపురంలో పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య, రాజకీయ వేధింపులు కారణమని ఆరోపణలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఏపీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు భారీగా పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణశాఖ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి
ఈస్ట్ వెస్ట్ షీర్ జోన్ 20 డిగ్రీస్ నార్త్ లో సముద్రం మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య ఉత్తర ద్వీపకల్ప భారత్ మొత్తం కేంద్రీకృతమైంది. నిన్న వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఇవాళ ఉత్తర ఒడిశాను ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
ఉత్తర కోస్తా, యానాంలో ఇలా..
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. నేడు, రేపు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
Telangana Weather: తెలంగాణలో ఇలా..
తెలంగాణలో అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణలో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా చోట్ల భారీ వర్షాలు పడతాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. మిగతా చోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ వాతావరణం
‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్నిసార్లు తీవ్రమైన జల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ నైరుతి దిశ ఉపరితల గాలులు గాలి వేగం గంటకు 8 నుంచి 14 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.6 డిగ్రీలు, 21.6 డిగ్రీలుగా ఉంది.
అమలాపురంలో పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య, రాజకీయ వేధింపులు కారణమని ఆరోపణలు
కోనసీమ జిల్లా అమలాపురం మేధా గార్డెన్ లో మహిళ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ సెక్రెటరీ భారతి భవాని ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ వేధింపులు కారణంతో ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తు్న్నారు. ఇటీవలే అప్పనపల్లికి భారతీ భవాని బదిలీ అయ్యారు. సోమవారం అప్పనపల్లి పంచాయతీలో జాయిన్ కావాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి భవాని భర్త ఎలక్ట్రికల్ లైన్మెన్ పనిచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊట్‌పల్లి గ్రామంలో దారుణం జరిగింది. ప్రియుడు నవీన్ ఇంటిముందు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియురాలు దీపిక. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో పెళ్లి చేసుకుంటావా లేదు అంటూ ప్రియుడి ఇంటి ముందు నిలదీసింది ప్రియురాలు. పెళ్లి చేసుకోను అని నవీన్ చెప్పడంతో మనస్థాపానికి గురైన దీపిక ప్రియుడి ఇంటి ముందు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పరిగి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.
Eluru: బోరు బావిలో పడ్డ బాలుడు సురక్షితం
ఏలూరు జిల్లాలో బోరు బావిలో పడిపోయిన బాలుడిని ఎట్టకేలకు బయటకు తీశారు. సురేష్ అనే బాలుడికి తాడు కట్టి బోరుబావిలోకి పంపి బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గుండుగొలనుగుంటలో పూర్ణ జస్వంత్ అనే చిన్నారి బావిలో పడిపోగా 5 గంటల తర్వాత బయటకు తీసుకొచ్చారు.
Ex MLA Death: మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి మృతి
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో.. కుటుంబ సభ్యులు అమలాపురంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పులపర్తి కన్నుమూశారు. ఆయన మరణంపై రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. ఆయనకు భార్య, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
నారాయణమూర్తి 1996 వరకు టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా విధులు నిర్వహించారు. ఉద్యోగంలో ఉండగానే 1996లో జరిగిన ఉప ఎన్నికలో నగరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ-బీజేపీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో పులపర్తి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు.
ఆ తర్వాత 2014లో పీ.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు.. దీంతో వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ ప్రచారానికి పిఠాపురం వచ్చిన సమయంలో.. ఆయన సమక్షంలోనే కండువా కప్పించుకునేందుకు వెళ్లారు.. కానీ అనూహ్యంగా పార్టీలో చేరకుండా వెనుదిరిగారు. అనంతరం బీజేపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ లోనే కొనసాగుతున్నారు.
Vemulawada: వేములవాడ ఈవోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న బంద్
వేములవాడ ఆలయ ఈవో రమాదేవి నిర్లక్ష్య వైఖరి, ఆర్జిత సేవా టికెట్ల పెంపు, స్థానికులకు దర్శనాలు కల్పించడం లేదని బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు తలపెట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. వర్తక, వాణిజ్య, హోటళ్లు, విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, రాజన్న దర్శనానికి వచ్చే పేద భక్తులను దేవాదాయశాఖ అధికారులు నిలువునా దోచుకుంటున్నారని, ఇటీవల అన్ని రకాల టికెట్లపై రేట్లు పెంచి పరోక్షంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆలయ ఉద్యోగులను సైతం వేధిస్తుందని, ఈఓ కు ప్రాణ భయం ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలని, కేవలం మహిళా అని అడ్డుపెట్టుకొని రాజకీయ నాయకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.