News
News
X

Breaking News Live Telugu Updates: ఆచార్య సెట్ లో భారీ అగ్నిప్రమాదం. భారీగా ఎగసిపడుతున్న మంటలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
ఆచార్య సెట్ లో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

ఆచార్య సెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సినిమాలోని పాదఘట్టం సెట్ హైదరాబాద్ లోని కోకాపేటలో వేశారు. ఈ సెట్ ఇంకా తొలగించలేదు. ఇదే సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్టును ఖండించిన సీఎం కేసీఆర్

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 
ఇది అదానికి ప్రధాని మోడీ కి నడుమనున్న అనుబంధాన్నించి ప్రజల దృష్టిని మల్లించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదు.
- బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

హైదరాబాద్ లో గన్ తో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య

హైదరాబాద్ లో గన్ తో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య

జూబ్లీహిల్స్ అపోలోకు తరలింపు...
కుటుంబ తగాదాల కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసిన మజార్..

 రోడ్ నెంబర్ 12 లో తన ఇంట్లో ఆత్మహత్యానికి పాల్పడ్డ మజార్..

 తీవ్ర గాయాల పాలైన మజారిని ఆస్పత్రులు చేర్పించిన కుటుంబ సభ్యులు..

 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన మజార్....

మృతుడు మజర్‌ అలీ ఖాన్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి సమీప బంధువు

Tirupati News: తిరుపతిలో సోమువీర్రాజుకి‌ నిరసన సెగ

తిరుపతిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం బయటకు వచ్చిన సోము వీర్రాజుకి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల నుంచి నిరసన సెగ ఎదురైంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసొడియా అరెస్టును నిరసిస్తూ సోము వీర్రాజు వాహనానికి అడ్డంగా రోడ్డుపై బైఠాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాని వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డు పైనే బైఠాయించారు. సోమువీర్రాజు వాహనానికి అడ్డంగా కూర్చోవడంతో కోపోద్రిక్తులైన బీజేపీ కార్యకర్తలు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలపై వాగ్వాదానికి దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తెచ్చిన ప్లకార్డులకు ఉన్న కట్టెలను తీసుకొని వారిని కొట్టడంతో పాటు అక్కడ నుంచి తరిమివేశారు. సిసోడియా అరెస్ట్ ని నిరసిస్తూ తాము శాంతియుతంగా నిరసన చేస్తుంటే తమపై బీజేపీ నాయకులు దాడికి పాల్పడ్డారని, వెంటనే వారిని అరెస్టు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

D Srinivas Health: డి.శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ చీఫ్‌గా పని చేసిన సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన్ను.. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని తెలిపారు. కాబట్టి తాను రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని తెలిపారు. నేడు రేపు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు.

ABVP Leaders Arrest in Warangal: ఏబీవీపీ కార్యకర్తల అరెస్టు
 • అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు బంద్‌కు యత్నిస్తున్న ఏబీవీపీ కార్యకర్తల అరెస్టు
 • ర్యాగింగ్, వేధింపులతో బలైన మెడికొ ప్రీతి ఆత్మహత్య, ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ విద్యా సంస్థల బంద్

‘‘మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జించే విచారణ జరిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం దారావత్ ప్రీతీ కుటుంబానికి న్యాయం చేయాలి. మెడికో ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన సైఫ్,  కళాశాల అధికారులను కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో తరచూ వెలుగు చూస్తున్న ర్యాగింగ్ విష సంస్కృతిని నిషేధించేలా ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించాలి. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం అనంతరం వైద్య విద్య కళాశాలలో ర్యాగింగ్ సాధారణం అని ప్రకటించిన అధికారులను సస్పెండ్ చేయాలి’’ అని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. 

Chigurupati Jayaram Murder Case: చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పు
 • చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పు
 • 2019 జనవరి 31 న చిగురుపాటి జయరాం హత్య
 • నాలుగు సంవత్సరాల పాటు విచారణ అనంతరం తీర్పు ప్రకటించనున్న నాంపల్లి కోర్టు
 • 388 పేజీల చార్జ్ షీట్ దాఖలు  చేసిన పోలీసులు
 • చార్జ్ షీట్లో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు
 • 300 మందికి పైగా వ్యక్తులను విచారించిన పోలీసులు
 • 80 మందిని సాక్షులుగా పేర్కొన్న పోలీసులు
 • ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి సహకరించిన పోలీసుల పైన డిపార్ట్మెంట్ పరంగా చర్యలు..
 • కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసు అధికారుల పాత్రపై ఉత్కంఠ
Meghalaya, Nagaland Elections: కొనసాగుతున్న నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. 60 మంది శాసన సభ స్థానాలు ఉన్న మేఘాలయ అసెంబ్లీ కి జరుగుతున్న ఎన్నికల్లో 369 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 640 పోలింగ్ కేంద్రాల్లో 323 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మేఘాలయలో పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా సాగుతుందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎఫ్ఆర్ ఖర్ కోంగర్ చెప్పారు.

నాగాలాండ్‌లో 59 అసెంబ్లీ స్థానాల్లో 183 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నాగాలాండ్ లో 13 లక్షల మంది ఓటు హక్కు వాడుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ముగియనుంది. ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ 23, 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 2018వ సంవత్సరంలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. పోలింగ్ కోసం 2,291 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య పోలింగ్ సాగుతోంది.

Kukatpally Fire Accident: కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం

మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ప్రశాంత్ నగర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు స్క్రాప్ షాప్ తో పాటు 2 ప్లాస్టిక్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే షెడ్లు ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో వాటిలోని సామగ్రి పూర్తిగా దగ్ధం అయ్యాయి. వెంటనే స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో అశోక్ లేలాండ్ వాహనంతో పాటు మారుతి కారు కూడా దగ్ధమైనట్లు కూకట్ పల్లి పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Preethi News: నిమ్స్‌ నుంచి స్వగ్రామానికి ప్రీతి మృతదేహం, అక్కడే నేడు అంత్యక్రియలు
 • స్వగ్రామంలో ప్రీతి మృతదేహం, నేడు అక్కడే అంత్యక్రియలు
 • జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు చేరుకున్న ప్రీతి మృతదేహం
 • స్వగ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బంధువులు
 • కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు
 • భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
Background

పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 

తెలంగాణలో క్రమంగా చలి తగ్గి వేడి పెరుగుతోంది. నేడు తెలంగాణలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సాధారణంగా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు, రాత్రి పూట చలి విషయంలో 7 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.

హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.3 డిగ్రీలుగా నమోదైంది.

ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

 

ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 

ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
మరో 3 లేదా 4 రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరుతుందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ‘‘ఎల్-నినో ఏర్పడే అవకాశాలు ఈ ఏడాది కనిపిస్తున్నాయి కాబట్టి రానున్న మూడు నెలల్లో ఎండల వేడి బాగా ఎక్కువ ఉండనుంది. పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లా-నినా ఇప్పుడు బాగా బలహీనపడింది. దీని ప్రభావం మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. మార్చి నుంచి మే నెలలో మనకు ఎండలు బాగానే కాస్తాయి.

కానీ గత మూడు సంవత్సరాలుగా సాధారణం కంటే తక్కువగానే ఎండలు ఉన్నాయి. చాలా మంది ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంది అని అనుకున్నారు, కానీ ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన కాదు. ఇది పసిఫిక్ లో ఏర్పడిన లా-నినా ప్రభావం. కాబట్టి రానున్న రోజుల్లో లానినా ఉండదు కాబట్టి. ఎండలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2003, 2009, 2012, 2015, 2018 సంవత్సరాల్లో ఎల్-నినో ఏర్పడే తరుణంలో ఎండలు సాధారణం కంటే ఎక్కువగానే ఉండనున్నాయి. దీనికి తోడు మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు బర్మా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్లడం జరిగితే వడగాల్పులు ఉండటం సాధారణం. మరి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.