Breaking News Live Telugu Updates: సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు, యథావిధిగా కేబినెట్ భేటీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నైరుతి రుతుపవనాలు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల అల్పపీడన ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరో మూడు రోజులు ఇక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ఉరుములు మెరుపులు కూడా రావచ్చని అధికారులు అంచనా వేశారు.
నెల్లూరు జిల్లా ఉత్తర భాగాల్లో వర్షాలు కురిశాయని, అవి నేరుగా ప్రకాశం జిల్లా దక్షిణ భాగాలకు ముఖ్యంగా చిమకుర్తి, కనిగిరితో పాటుగా తూర్పు భాగాలైన కందుకూరు - ఒంగోలు బెల్ట్, చీరాలలో వర్షాలు పెరగనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు. అర్ధరాత్రి దాటాక బాపట్ల జిల్లాలో వర్షాలు పడనున్నాయని అంచనా వేశారు.
Telangana Weather News: తెలంగాణ వాతావరణం ఇలా
‘‘తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు ఇంకాస్త తగ్గింది. 10 గ్రాములకు రూ.200 తగ్గింది. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.300 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,450 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,760 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,450 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,760గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,000 గా ఉంది.
సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు, యథావిధిగా కేబినెట్ భేటీ
రేపటి ఏపీ కేబినెట్ భేటీ యథావిధిగా జరగనుంది. సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దైన కారణం కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ రేపు దిల్లీ వెళ్లనున్నట్లు ముందు వార్తలు వచ్చాయి కానీ ఆ పర్యటన రద్దు అయినట్లు సమాచారం. మంత్రులందరూ 11 గంటలకు హజరవ్వాలని సీఎంవో ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ లో మరో దారుణం, బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం
హైదరాబాద్ చత్రినకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పుగుడలో దారుణం జరిగింది. 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. గతంలో అలీ అనే యువకుడితో బాలికకు పరిచయం ఉండేది. ఆ పరిచయంతో అలీ అనే యువకుడు బాలికను ఇంటికి పిలిచి తన మిత్రుడు ఆర్బాస్ తో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు అలీ, అర్భాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tollywood News: సమ్మె విరమించిన సినీకార్మికులు
తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులు సమ్మెను విరమించారు. ఫిల్మ ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం కావడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు అంగీకారం లభించింది. దీంతో కార్మికులు రేపటి నుంచి షూటింగుల్లో పాల్గొననున్నారు. కొత్త వేతనాల ద్వారానే రేపటి నుంచి షూటింగ్ ఉండనుంది.
PJR Daughter In Congress: పీజేఆర్ కుమార్తె కాంగ్రెస్ లో చేరిక
పీజేఆర్ కుమార్తె, టీఆర్‌ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో గురువారం విజయారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఖైరతబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. తాను పార్టీ మారడం ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Hyderabad News: చిట్టీల పేరుతో భారీ మోసం
- చిట్టీల పేరుతో ఐదున్నర కోట్ల రూపాయలు మోసం చేసిన దంపతులను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు
- తమకు న్యాయం చేయాలని సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన
- శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలియాబాద్ ప్రాంతానికి చెందిన మధు, భార్య దివ్య
- ఆరు సంవత్సరాల నుంచి చిట్టి వ్యాపారం
- చిట్టీలు పూర్తయినా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు 11 నెలల క్రితం శాలిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- కేసు సీసీఎస్ కు టాన్స్ ఫర్ కావడంతో దంపతులను ఈ రోజు అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు
- చిరు వ్యాపారాలు చేస్తున్న తన బిడ్డల పెళ్లిళ్లకు మధు వద్ద 50 వేల నుంచి ఐదు లక్షల వరకు చిట్టీలు వేసినట్లు తెలిపిన బాధితులు
- సుమారు 70 మంది నుండి రూ 5.5 కోట్లు దండుకున్నట్లు వెల్లడి