AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్‌సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నైరుతి రుతుపవనాలు గత ఏడాదితో పోల్చితే వారం నుంచి పది రోజుల ముందే ఏపీ, తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అదే సమయంలో బలమైన వేడి గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా బలమైన వేడిగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాంతంలో వేడిగాలులకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక లేదు. నేడు ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు ఈ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక వేడి గాలులకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు పెరిగింది. గ్రాముకు ఏకంగా రూ.60 చొప్పున పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.400 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,090 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,100 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,100 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,100 గా ఉంది.
Vijayawada కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎఫ్ 3 మూవీ యూనిట్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను దర్శించుకున్నారు. ఎఫ్ త్రీ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ విజయవాడకు వచ్చింది. ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించారు. అమ్మ వారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని ఎఫ్ 3 మూవీ యూనిట్ సభ్యులకు ఆలయ అధికారులు అందజేశారు.
MLC Ananta Babu Suspension: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్‌సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సుబ్రహ్మణ్యంను తన వెంట తీసుకుని వెళ్లిన ఎమ్మెల్సీ ఆపై గొడవ జరగడంతో నెట్టియగా డ్రైవర్ చనిపోయాడని పోలీసుల విచారణలో అంగీకరించారు. ఎమ్మెల్సీ హత్య చేయడంతో సామాన్యులకు ప్రభుత్వంలో ఎలాంటి రక్షణ ఉంటుందని కాకినాడ జిల్లాలో మూడు రోజులపాటు ఆందోళన నిర్వహించారు.
Yasin Malik Case Verdict: జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు
Yasin Malik: జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. యాసిన్ మాలిక్ కు మరణ శిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డిమాండ్ చేసింది. 2017లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంతోపాటు ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం అందించిన కేసుల్లో యాసిన్ మాలిక్‌ను దోషిగా దిల్లీ కోర్టు గత వారం నిర్ధరించింది.
Nandyala Districtలో వైఎస్సార్‌సీపీ ఉప సర్పంచ్ దాష్టీకం, హుండీపై చేతివాటం
నంద్యాల జిల్లా లోని ఓ ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సమయంలో వైసీపీ ఉప సర్పంచ్ దాష్టీకానికి పాల్పడ్డారు. హుండీ లెక్కిస్తుండగా బంగారం, వెండి వస్తువులు తీసుకుని వెళ్లిపోయే ప్రయత్నం చేయగా దాడికి దిగారు. ఉప సర్పంచ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆలయ సిబ్బందిపై దాడిచేసి ముగ్గుర్ని గాయపరిచినట్లు సమాచారం.
Stone Pelting At SP Vehicle: తూ.గో. జిల్లా ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
తూ.గో. జిల్లా ఎస్పీ వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో మరోసారి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై కొందరు ఆందోళనకారులు రావులపాలెం రింగ్‌రోడ్ వద్ద రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు వెంటపడటంతో ఆందోళనకారులు పరారయ్యారు.